మండల పూజలకు ముందే భక్తులతో పోటెత్తిన శబరిమల

by Y. Venkata Narasimha Reddy |
మండల పూజలకు ముందే భక్తులతో పోటెత్తిన శబరిమల
X

దిశ, వెబ్ డెస్క్ : మండల, మకర విళక్కు పూజలు ప్రారంభం కాకముందు నుంచే శబరిమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తులు శబరిమలకు పోటెత్తడంతో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7 గంటలకుపైగా క్యూలైన్లలోనే భక్తులు పడిగాపులు పడ్డారు. గంటలకు గంటలు క్యూలైన్లలో నిలబడి ఉన్నా.. కనీస సౌకర్యాలు కల్పించడం లేదంటూ భక్తులు ఆవేదన చెందారు. క్యూలైన్లలో చాలా మంది పిల్లలు, వృద్ధులు, అయ్యప్ప మాలదారులు ఉన్నారు. శబరిమల అయ్యప్ప క్షేత్రంలో ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తూ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమలలో నెల దర్శనం, నక్షత్ర దర్శనాల కోసం అయ్యప్ప భక్తులు ముందుగా టికెట్లు బుక్ చేసుకుని.. భారీగా తరలివచ్చారు. మరోవైపు శబరిమలలో వర్షాలు కురుస్తుండటం..చలిగాలులు వీస్తుండటంతో భక్తులు మరింత ఇక్కట్లకు గురవుతున్నారు.

ఇక భారీగా తరలివచ్చిన భక్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు, కేరళ ప్రభుత్వం భోజనాలు, తాగునీటి వసతి కల్పించడంలో విఫలమైందని అయ్యప్ప భక్తులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్యూలైన్లలోనే భక్తులు పలుమార్లు నిరసనకు దిగారు. భక్తుల రద్దీ నేపథ్యంలో దర్శన వేళలను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పెంచింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప దర్శనాలు కొనసాగనుండగా.. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు బ్రేక్ ఇవ్వనున్నారు. అటు శబరిమలలో నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు మండల పూజలు కొనసాగనున్నాయి. అనంతరం రెండు రోజుల పాటు శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆ తర్వాత డిసెంబరు 30వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు మకర విళక్కు పూజలు జరగనుండగా.. చివరిరోజు పడిపూజతో దర్శనాలు ముగియనున్నాయి. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి (మకర విళక్కు) దర్శనం కలగనుంది.

Advertisement

Next Story