వారం రోజుల్లో రూ. 3,700 కోట్ల విలువ మ్యావ్ మ్యావ్ పట్టివేత

by S Gopi |
వారం రోజుల్లో రూ. 3,700 కోట్ల విలువ మ్యావ్ మ్యావ్ పట్టివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకునేందుకు మహారాష్ట్ర పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం రాష్ట్రంలోని సాంగ్లీలో జరిపిన దాడుల్లో రూ. 300 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మ్యావ్ మ్యావ్‌గా పిలిచే 140 కిలోల డ్రగ్‌ను కుప్వాడ్ ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ కంపెనీలో జరిగిన దాడుల్లో పట్టుకున్నారు. అలాగే, డ్రగ్ సిండికేట్‌తో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పూణె పోలీసులు చేసిన దాడుల్లో ఈ వారం రోజుల్లో ఇప్పటివరకు మొత్తం రూ. 3,700 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుఝామున పూణె, ఢిల్లీ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ. 2,500 కోట్ల కంటే ఎక్కువ విలువైన 1,100 కిలోల మ్యావ్ మ్యావ్‌ను పోలీసులు కనుగొన్నారు. పూణెలో జరిగిన దాడుల్లో ముగ్గురు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు 700 కిలోల మెఫెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలోని గోడౌన్‌ల నుంచి మరో 400 కిలోలను పట్టుకున్నారు. ఈ కేసును టెర్రర్ ఫండింగ్ కోణంలో దర్యాప్తు చేయనున్నట్టు పూణె పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story