గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ స్వాధీనం

by S Gopi |
గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న గాంధీధామ్ పట్టణ సమీపంలో రూ. 130 కోట్ల విలువైన 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుఝామున స్మగ్లర్లు పట్టుబడకుండా ఉండేందుకు సముద్ర తీరంలో దాచిపెట్టారని విచారణలో తేలినట్టు కచ్-ఈస్ట్ డివిజన్ ఎస్పీ సాగర్ బాగ్మార్ చెప్పారు. గడిచిన ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద డ్రగ్ రికవరీ అని ఆయన పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), స్పెషల ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా గాంధీధామ్ పట్టణ సమీపంలోని మితి రోహర్ గ్రామం నుంచి ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో సైతం ఇదే ప్రాంతం నుంచి కొకైన్‌ను పట్టుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. ఒక్కో ప్యాకెట్ దాదాపు కిలో గ్రాము ఉన్న మొత్తం 13 ప్యాకెట్లను పట్టుకున్నామని, కొందరు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఏటీఎస్ ఎస్పీ సునీల్ జోషి తెలిపారు. గతేడాది పట్టుకున్న సమయంలో పోలీసులు 80 కొకైన్ ప్యాకెట్లు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ. 800 కోట్లు ఉంటుంది.

Advertisement

Next Story