Priyanka Gandhi Victory: ఇక ఎంపీ ప్రియాంక గాంధీ.. విజయంపై భర్త వాద్రా ఏమన్నారంటే..

by Rani Yarlagadda |   ( Updated:2024-11-23 09:41:53.0  )
Priyanka Gandhi Victory: ఇక ఎంపీ ప్రియాంక గాంధీ.. విజయంపై భర్త వాద్రా ఏమన్నారంటే..
X

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభలోకి ప్రియాంకగాంధీ (Priyanka Gandhi) అరంగేట్రం భారీ మెజార్టీతో ఖరారయింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) వయనాడ్ ఎంపీ (Wayanad MP)గా రాజీనామా చేయడంతో.. ఆ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. దీంతో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. వయనాడ్ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో.. తొలి రౌండ్ నుంచి భారీ మెజార్టీతో దూసుకెళ్లారామె. సమీప బీజేపీ అభ్యర్థి నవ్య పై 4.04 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలిచి.. విజయ ఢంకా మోగించారు. ప్రియాంక గాంధీకి మొత్తం 6,17,942 ఓట్లు వచ్చినట్లు ఈసీ పోర్టల్ వెల్లడించింది.

ప్రియాంక గాంధీ గ్రాండ్ విక్టరీ పై భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra) స్పందించారు. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని తెలుసన్నారు. ఆమె కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రియాంక ఇకపై ఎంపీగా ప్రజల సమస్యలను పార్లమెంట్ లో వినిపిస్తారని, ప్రజల కోసం శ్రమిస్తారన్నారు. ప్రస్తుతం ఆమె పుస్తక పఠన, పిల్లల్ని చూసుకోవడంలో బిజీగా ఉన్నారని, దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతోనే ఈ ఎన్నికల బరిలో దిగారన్నారు.

అలాగే తాను కూడా ప్రజల కోసం శ్రమిస్తానని, అందుకు పార్లమెంట్లోనే ఉండాల్సిన అవసరం లేదన్నారు వాద్రా. ముందు ముందు తనకు కూడా ప్రజలు అలాంటి అవకాశమిస్తే తప్పకుండా స్వీకరిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మహారాష్ట్ర ఫలితాలను చూసి.. కొత్త పాఠాలను నేర్చుకోవాలన్నారు. ఏదేమైనా ప్రజల తీర్పును గౌరవించాలని, గెలిచిన పార్టీలతో కలిసి అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి గెలవడంపై హర్షం వ్యక్తం చేశారు.


Read More..

AICC: మెజారిటీలో రాహుల్‌ను క్రాస్ చేసిన ప్రియాంక గాంధీ

Advertisement

Next Story

Most Viewed