Rahul Gandhi : బీజేపీ ‘పద్మవ్యూహం’లో యావత్ దేశం : రాహుల్‌గాంధీ

by Hajipasha |
Rahul Gandhi : బీజేపీ ‘పద్మవ్యూహం’లో యావత్ దేశం : రాహుల్‌గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో భయానక వాతావరణం ఉందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడిని చక్రవ్యూహంలో బంధించినట్టుగా.. బీజేపీ వేసిన పద్మవ్యూహంలో యావత్ దేశం చిక్కుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొక్కాపై ధరించే కమలం గుర్తును ‘పద్మం’ అని కూడా పిలుస్తారని.. ఆ పద్మం చిహ్నం పద్మవ్యూహాన్ని పోలి ఉందని రాహుల్ కామెంట్ చేశారు. ‘‘ప్రస్తుతం యావత్ దేశం ఆ పద్మవ్యూహంలో చిక్కుకుపోయింది. యువకులు అగ్నివీర్ అనే పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. అగ్నివీర్లకు పెన్షన్ కోసం బడ్జెట్‌లో ఎటువంటి కేటాయింపులు లేవు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘పద్మవ్యూహంలో హింస, భయం ఉంటాయి. అభిమన్యుడు అందులోనే చిక్కుకొని బలైపోయాడు’’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం చక్రవ్యూహాన్ని నిర్మిస్తే.. తాము కులగణన చేపట్టి దాన్ని విచ్ఛిన్నం చేస్తామని ఉద్ఘాటించారు. బీజేపీ ఎంపీలతో సహా రైతులు, కార్మికులు, ప్రతి ఒక్కరూ బీజేపీ పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారని ఆయన తెలిపారు.

‘‘వాళ్లే ఆ ఆరుగురు..’’

‘‘నేను చెబుతున్న మాటలకు అధికార కూటమి నేతలు నవ్వుతున్నారు. కానీ వాస్తవానికి వాళ్లు కూడా భయపడుతూనే ఉన్నారు. అధికార కూటమిలో ప్రధాని కావాలనే కలను కేవలం ఒకే వ్యక్తి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ ప్రధానమంత్రి కావాలని రక్షణ మంత్రి భావిస్తే, అదొక పెద్ద సమస్యగా మారుతుందనే భయం ఉంది. భయం ఎందుకిలా వ్యాపిస్తోందో నాకు అర్థం కావడం లేదు. బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రులు కూడా భయంలోనే ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. ‘‘ఆనాడు అభిమన్యుడిని ఆరుగురు వ్యక్తులు చంపారు. నేటి పద్మవ్యూహంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అంబానీ, అదానీ అనే ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారి పద్మవ్యూహంలో చిక్కుకొని యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్యతరహా వ్యాపారులు విలవిలలాడుతున్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశమని ఆయన ఆరోపించారు.

అదానీ, అంబానీ పేర్లను ప్రస్తావించడంపై దుమారం

ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు(అదానీ, అంబానీ) దేశంలోని మౌలిక సదుపాయాలను నియంత్రిస్తున్నారని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికార, విపక్ష సభ్యుల వాదోపవాదనలతో సభలో గందరగోళం ఏర్పడింది. రాహుల్‌కు సభానియమాలు తెలియవని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌రిజిజు విమర్శించారు. అందుకు బదులిచ్చిన రాహుల్‌.. అధికార పక్ష నేతల వ్యవహారశైలికి అనుగుణంగా స్పందిస్తామన్నారు. స్పీకర్ ఓంబిర్లా స్పందిస్తూ.. లోక్‌సభ నియమావళిని మరోసారి చదువుకోవాలని రాహుల్ గాంధీకి సూచించారు.

Advertisement

Next Story