భారత కొత్త పర్యాటక ప్రదేశంగా 'అయోధ్య'

by S Gopi |   ( Updated:2024-01-22 06:31:16.0  )
భారత కొత్త పర్యాటక ప్రదేశంగా అయోధ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో సోమవారం రామమందిరం ప్రాణప్రతిష్ట భారత ఆర్థికవ్యవస్థపై అత్యంత ప్రభావాన్ని చూపుతుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అభిప్రాయపడింది. ఏటా 5 కోట్లకు పైగా పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యంతో భారత్‌కు అయోధ్య 'కొత్త పర్యాటక ప్రదేశం'గా మారనుంది. కొత్త విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్‌షిప్, మెరుగైన రోడ్ల కనెక్టివిటీ, కొత్త హోటళ్లు, ఆర్థిక కార్యకలాపాలు, మరెన్నో మౌలిక సదుపాయాలు కలిపి మొత్తం 10 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఇది టూరిజం కోసం ఇన్‌ఫ్రా ఆధారిత వృద్ధిలో కొత్త ఒరవడిని సృష్టించగలదని జెఫరీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. 2018-19లో(కరోనాకు ముందు) దేశ జీడీపీకి పర్యాటక రంగం రూ. 16.12 లక్షల కోట్ల సహకారం అందించింది. 2032-33 నాటికి ఇది ఏటా 8 శాతం వృద్ధితో రూ. 36.81 లక్షల కోట్లకు వృద్ధి చెందుతుందని అంచనా. భారత టూరిజం, జీడీపీ నిష్పత్తి ప్రపంచ సగటు కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, భారత్ ఇంకా మతపరమైన అతిపెద్ద పర్యాటక కేంద్రంగానే ఉంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాల లోటు ఉన్నప్పటికీ ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఏడాదికి 1-3 కోట్ల పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 2022లో ఫోర్బ్స్ సంస్థ ప్రపంచంలోని 50 దేశాల్లో భారత్‌కు 7వ అత్యంత అందమైన దేశంగా ర్యాంక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయోధ్య మెరుగైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలతో కొత్త మతపరమైన పర్యాటక కేంద్రంగా నిలవనుంది, ఇది ఆర్థికవ్యవస్థపై మెరుగైన ప్రభావం చూపనుంది. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి కారణంగా హోటల్, ఫుడ్ టెక్, ట్రావెల్, ఎఫ్ఎంసీజీ వంటి రంగాల షేర్లలో ర్యాలీకి అవకాశం ఉందని జెఫరీస్ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed