Rahul Gandhi: అదంతా పోయింది.. ఇది ఇప్పుడు చరిత్ర- ఆర్ఎస్ఎస్ పై రాహుల్ విమర్శలు

by Shamantha N |
Rahul Gandhi: అదంతా పోయింది.. ఇది ఇప్పుడు చరిత్ర- ఆర్ఎస్ఎస్ పై రాహుల్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ(BJP), ఆర్ఎస్ఎస్(RSS) పై కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రజల్లో ఉన్న భయం ఇప్పుడు కనుమరుగైందన్నారు. మూడ్రోజుల అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వర్జీనియాలోని హెర్న్‌డాన్‌లో భారతీయ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత భారతదేశంలో "కచ్చితంగా ఏదో మార్పు వచ్చింది" అని అన్నారు. భయపడే వాతావరణం మాయమైందన్నారు. "బీజేపీ, నరేంద్రమోడీ.. మీడియా, ఏజెన్సీల ద్వారా భయాన్ని వ్యాప్తి చేశారు. కానీ, సెకన్లలో అదంతా మాయమైంది. ప్లాన్ ప్రకారం చాలా డబ్బుతో ఈ భయాన్ని వ్యాప్తి చేసేందుకు వారికి సంవత్సరాలు పట్టింది. కానీ, ఒక్కసెకన్ లోనే అంతా ముగిసింది” అని అన్నారు. ఇక, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాందీ విరుచుకుపడ్డారు. " నేను దీనిని పార్లమెంటులో చూస్తాను. నేను ప్రధానమంత్రిని నేరుగా చూసి.. మీ 56 అంగుళాల ఛాతి ఆలోచన, దేవుడితో ప్రత్యక్ష సంబంధం, అదంతా పోయింది, ఇది ఇప్పుడు చరిత్ర.. అని చెప్పగలను" అని రాహుల్ మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఆర్ఎస్ఎస్ పై విమర్శలు

ఆర్‌ఎస్‌ఎస్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఆ సంస్థ కొన్ని రాష్ట్రాలను ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా చూస్తోందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఇలా చెప్పడానికి కారణం.. భారతదేశాన్ని అర్థం చేసుకోకపోవడమే అని అన్నారు. "ఆర్‌ఎస్‌ఎస్ చెప్పేది ఏమిటంటే.. కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువ. కొన్ని భాషలు ఇతర భాషల కంటే తక్కువ. కొన్ని మతాలు ఇతర మతాల కంటే తక్కువ. మరియు కొన్ని వర్గాలు ఇతర వర్గాల కంటే తక్కువ. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్.. ఇలా మీరు ఎక్కడ్నుండి వచ్చిన వారైనా, మీ అందరికీ మీ చరిత్ర, సంప్రదాయం, భాష ఉన్నాయి. అవన్నీ ఎంతో ముఖ్యమైనవే. కానీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో తమిళం, మణిపురి, మరాఠీ, బెంగాలీ ఇవన్నీ నాసిరకం భాషలు” అని రాహుల్ అన్నారు. "పోరాటం అంటే ఇదే. అది పోలింగ్ బూత్ లేదా లోక్‌సభలో ముగుస్తుంది. అయితే మనం ఎలాంటి భారతదేశాన్ని కలిగి ఉండబోతున్నాం అనేదానిపై పోరాటం ఉంటుంది. ఈ వ్యక్తుల సమస్య ఏమిటంటే వారు భారతదేశాన్ని అర్థం చేసుకోలేరు" అని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్జీనియాలో ప్రసంగించిన తర్వాత రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీలోని జార్ట్ టౌన్ యూనివర్సిటీకి వెళ్లారు. అక్కడకూడా ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed