Khalistan Terrorist Pannun:సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవి

by Shamantha N |
Khalistan Terrorist Pannun:సిక్కుల గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు సాహసోపేతమైనవి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) సిక్కులపై చేసిన వ్యాఖ్యలపై నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్‌ జస్టిస్‌ సంస్థ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ స్పందించాడు. రాహుల్ కి మద్దతు తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలు ఎస్‌ఎఫ్‌జే గ్లోబల్‌ ఖలిస్థాన్‌ రెఫరెండం ప్రచారాన్ని సమర్థించేలా ఉన్నాయని అన్నాడు. భారతదేశంలో సిక్కుల అస్తిత్వ ముప్పు గురించి రాహుల్ గాంధీ చేసిన ప్రకటన సాహసోపేతమైనదని.. మార్గదర్శకమైనదని కొనియాడారు. అంతేకాదు, 1947 నుండి భారతదేశంలోని వరుస పాలనలలో సిక్కులు ఎదుర్కొంటున్న వాస్తవ చరిత్రను ఆయన ప్రపంచానికి తెలియజేశారన్నారు. సిక్కుల సొంత దేశమైన ఖలిస్థాన్‌ కోసం పంజాబ్‌ ఇండిపెండెన్స్‌ రెఫరెండం చేపట్టాలన్న ఎస్‌ఎఫ్‌జే వైఖరికి మద్దతుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పన్నూ ప్రకటించాడు.

రాహుల్ ఏమన్నాడంటే?

సోమవారం వాషింగ్టన్‌ డీసీ సమీపంలో హండన్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. కాగా.. తన ముందు కూర్చొన్న వారిలో తలపాగాతో ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ- సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనేవాటిపైనే భారత్‌లో ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. అన్ని మతాలకూ ఇదే పరిస్థితి తప్పడం లేదన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. కాగా.. వీటిపైనే ఖలిస్థానీ ఉగ్రవాది వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Advertisement

Next Story