సత్యం కోసం పోరాటాన్ని ఆపలేదు.. రాహుల్ గురించి ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్

by Shamantha N |
సత్యం కోసం పోరాటాన్ని ఆపలేదు.. రాహుల్ గురించి ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వచ్చాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కేవలం 292 సీట్లకే పరిమితమైంది. ఇండియా కూటమి కాషాయ పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చింది. కాగా.. ఈ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు.

ప్రియాంక ఎమోషనల్ పోస్టు

‘ నిన్ను ఎంతో అవమానించినా, అవహేళన చేసినా.. ఏం చేసినా సరే తట్టుకుని నిలబడ్డావు. అవరోధాలు ఎదురైనప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. నీ నమ్మకాన్ని ఎంతగా అవమానించినా విశ్వాసాన్ని కోల్పోలేదు. నీపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా సత్యం కోసం నీ పోరాటాన్ని ఆపలేదు. నీపై కోపం, ద్వేషం చూపించినా వాటిని నీ దరి చేరనీలేదు. ప్రేమ, దయతో సత్యం కోసం పోరాడావు. ఇది అందరికీ ఇప్పుడు అర్థమవుతోంది. అందరికంటే ధైర్యవంతుడివి నువ్వని తెలుసు. నీకు సోదరి అయినందుకు గర్వపడుతున్నాను’ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ప్రియాంక చేసిన ట్వీట్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది.

రెండు స్థానాల్లో గెలిచిన రాహుల్

గత ఎన్నికల్లో 52 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాలను దక్కించుకుంది. ఇక, పోటీ చేసిన రెండు చోట్ల రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందారు. రాయ్ బరేలీలో బీజేపీ నేత దినేష్ ప్రతాప్ సింగ్ పై 3.9 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. వయనాడ్ లో బీజేపీ కేరళ చీఫ్ కె. సురేంద్రన్ పై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Advertisement

Next Story

Most Viewed