నీట్ 'స్కామ్'పై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: రాహుల్ గాంధీ

by S Gopi |
నీట్ స్కామ్పై పార్లమెంటులో ప్రశ్నిస్తాం: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో జరిగిన అవతవకల ఆరోపణలకు సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌లో విద్యార్థుల గొంతుకగా ఉండి ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. ఇటీవల వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ - యూజీ పరీక్ష 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ.. పేపర్ లీకేజీ సమస్యల నుంచి విద్యార్థులను విముక్తి చేస్తామన్నారు. ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ బలమైన ప్రణాళిక రూపొందించిందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'నరేంద్ర మోడీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ నీట్ పరీక్షలో జరిగిన స్కామ్ కారణంగా 24 లక్షలకు పైగా విద్యార్థులు, వారి కుటుంబాలు నాశనమయ్యాయి. ఒకే పరీక్షా కేంద్రంలోని ఆరుగురు విద్యార్థులు టాప్ స్కోర్‌తో అగ్రస్థానంలో ఉన్నారు. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు సాంకేతికంగా సాధ్యం కాని మార్కులను పొందారు. అయినప్పటికీ పేపర్ లీకేజీ లేదని ప్రభుత్వం బుకాయిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యా మాఫియా, ప్రభుత్వ యంత్రాంగంతో కుమ్మక్కైన ఈ పేపర్ లీక్ మాఫియాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పటిష్టమైన ప్రణాళికను కలిగి ఉంది. మా మేనిఫెస్టో కూడా చట్టం చేయడం ద్వారా పేపర్ లీకుల నుంచి విద్యార్థులను విముక్తం చేస్తామని హామీ ఇచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. లోక్‌సభలో దేశంలోని విద్యార్థులందరి తరపున వారి గొంతుకను వినిపిస్తానని, వారి భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను గట్టిగా ప్రశ్నిస్తానని హామీ ఇస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed