రాజ్యసభకు రఘురామ్ రాజన్!..కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా?

by Prasad Jukanti |
రాజ్యసభకు రఘురామ్ రాజన్!..కాంగ్రెస్ వ్యూహం ఫలించేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో:ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ రాజ్యసభకు పోటీ చేయబోతున్నట్లు ప్రచారం గుప్పుమంటోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ అంతకు ముందే ఈ నెలాఖరులో పెద్దల సభకు జరగబోయే ఎన్నికల్లో రఘురామ్ రాజన్ ను బరిలోకి దిగబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ లేదా మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) అభ్యర్థిగా రఘురామ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో 2013లో ఆర్బీఐ గవర్నర్ గా నియమించబడిన రఘురామ్ రాజన్ మోడీ సర్కార్ ఏర్పడ్డాక 2016 వరకు పదవిలో కొనసాగారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ఆర్థిక విధాన నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు గుప్పించిన రఘురామ్ రాజన్ ను రాజ్యసభకు పంపాలనే ఆలోచన వెనుక కాంగ్రెస్ భారీ వ్యూహంతో ఉందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో రఘురామ్ రాజన్ భేటీ కావడంతో రాజ్యసభకు పోటీ విషయంపై ప్రచారానికి మరింత బలం చేకూరింది.

బీఆర్ఎస్ ఆర్థిక విధానాలను ఎండగట్టే వ్యూహాం:

ప్రతిపక్షాలపై మోడీ ప్రయోగిస్తున్న ఆయుధాలలో ఆర్థికపరమైన విధానం ఒకటి. తాము వచ్చాక దేశ ఆర్థిక అభివృద్ధి వేగంగా పుంజుకుంటోందనే కమలం పార్టీ పదే పదే క్లెయిమ్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ ఆర్థిక విధానాలకు సరైన రీతిలో కౌంటర్లు ఇవ్వడం ప్రతిపక్షాలకు అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ చట్టసభల్లో ఆధిపత్యం కొనసాగిస్తోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో బీజేపీని ఇరుకున పెట్టాలంటే ఆర్థిక అంశాలపై పట్టు, మోడీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల్లో గుట్టు తెలిసిన రఘురామ్ రాజన్ లాంటి వ్యక్తి అయితే మంచిదనే అభిప్రాయానికి కాంగ్రెస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రస్తుతం ఇండియా కూటమిలో తలోదారి అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. దీంతో మహారాష్ట్రలోని శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరాద్ పవార్), కాంగ్రెస్ పార్టీలు కూటమిలో ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు పంపేందుకు రఘురామ్ రాజన్ ను ఉమ్మడి అభ్యర్థిగా పోటీకి దింపాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 27న మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

288 అసెంబ్లీ స్థానాలున్న మ‌హారాష్ట్ర‌లో బీజేపీకి 116 మంది ఎమ్మెల్యేలు ఉండగా సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన‌కు 42 మంది ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక మ‌హావికాస్ అఘాడీ కూట‌మిలోని కాంగ్రెస్‌కు 44, శివ‌సేన‌(యూబీటీ)కు 16, శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులోని ఏక్ నాథ్ షిండే , అజిత్ పవార్ ఎమ్మెల్యేలు కలిస్తే మరో అభ్యర్థి గెలిచేఅవకాశం ఉంది. ఇక ఎంవీఏ కూటమి తరమపున ఒక అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. ఇందులో కాంగ్రెస్ తరపున అభ్యర్థి కంటే కూటమి తరపున రఘురామ్ రాజన్ ను ఉమ్మడి అభ్యర్థిగా నిలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రచారం తోసిపుచ్చినా ఆగని ప్రచారం:

తాను రాజ్యసభకు పోటీ చేయబోతున్నానని జరుగుతున్న ప్రచారాన్ని రఘురామ్ రాజన్ ఇటీవల తోసిపుచ్చారు. నేను విద్యావేత్తను, రాజకీయ నాయకుడిని కాదంటూ స్పందించారు. ఇటీవలి సమావేశాలు మరియు రాజ్యసభ సీటు గురించి పత్రికలలో కొన్ని ఊహాగానాలు వచ్చాయి. నేను ఏ పార్టీతోనూ రాజ్యసభ సీటు గురించి చర్చించలేదు. నేను విద్యావేత్తను, రాజకీయ నాయకుడిని కాదంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే రాజ్యసభ పోటీ విషయంలో రఘురామ్ రాజన్ రియాక్ష్ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనుబంధం కారణంగా ఆయన త్వరలోనే పోటీపై ప్రకటన చేస్తారనే ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఆయన రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సీఎంతో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ తో టచ్ లోనే ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో రాజ్యసభ పోటీ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.

Advertisement

Next Story

Most Viewed