ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం

by Harish |   ( Updated:2024-06-27 07:17:52.0  )
ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం కొత్తగా కొలువుదీరిన18వ లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఆమెకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత సభలో మాట్లాడిన రాష్ట్రపతి, కొత్తగా ఎన్నికైన సభ్యులను, సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందించారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా ఓటింగ్‌ నమోదైందని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల్లో దాదాపు 64 కోట్ల మంది ఓటర్లు ఉత్సాహంతో పాల్గొన్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. ముఖ్యంగా కాశ్మీర్‌లో ఓటింగ్‌కు సంబంధించిన అనేక సమస్యను ఈసీ సునాయాసంగా పరిష్కరించి, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఓటింగ్ నిర్వహించింది. ఆ ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కాశ్మీర్ లోయలో మార్పు శత్రువుల కుట్రలకు గట్టి బదులిచ్చినట్లయిందని ఆమె అన్నారు.

మోడీ ప్రభుత్వంపై తన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంసలు కురిపించారు. ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో పూర్తి మెజారిటీ ఏర్పడిందని, ఈ ప్రభుత్వంపై ప్రజలు మూడోసారి విశ్వాసం ఉంచారని అన్నారు. దేశ ప్రజల శ్రేయస్సు కోసం గత పదేళ్ళలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. గ్రామాలను అనుసంధానం చేసేందుకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 3.8 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించింది. ఆయుష్మాన్‌ భారత్ ద్వారా ప్రజలందరికి మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. అన్ని రంగాల్లో కూడా ఉపాధి అవకశాలు పెరిగాయని ఆమె అన్నారు

ఈశాన్య ప్రాంత అభివృద్ధిని గురించి ప్రత్యేకంగా మాట్లాడిన రాష్ట్రపతి, ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను 4 రెట్లు పెంచింది. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని స్ట్రాటజిక్ గేట్‌వేగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ రోజు, భారతదేశం ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను అందించడానికి ప్రసిద్ధి చెందింది, పోషకాహారం నుండి స్థిరమైన వ్యవసాయం వరకు, భారతదేశం అనేక సమస్యలకు పరిష్కారాలను అందించిందని ఆమె తన ప్రసంగంలో చెప్పారు.

నీట్ 'పేపర్ లీక్' కేసుల గురించి కూడా ఆమె మాట్లాడుతూ, ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించిందని ఆమె పేర్కొన్నారు. జులై 1 నుంచి దేశంలో కొత్త నేర చట్టాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం అనేది దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్ష, ఆ సంకల్పాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. దీనిని సాధించడంలో ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోవడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed