M Modi: వన్ ఎర్త్.. వన్ హెల్త్ అనేది భారత్ విజన్.. క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
M Modi: వన్ ఎర్త్.. వన్ హెల్త్ అనేది భారత్ విజన్.. క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండో- పసిఫిక్ దేశాలకు 40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్ లు అందించి క్యాన్సర్ పోరాటంలో సాయం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న మోడీ.. క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘40 మిలియన్ల వ్యాక్సిన్ డోస్‌లు కోట్లాది మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయి. వన్ ఎర్త్.. వన్ హెల్త్ (ఒక దేశం.. ఒక ఆరోగ్యం) అనేది భారత్‌ విజన్. అందుకే మూన్‌షాట్‌ చొరవ కింద 7.5 మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్‌లు, డిటెక్షన్‌ కిట్‌లతో పాటు వ్యాక్సిన్‌ల మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ ప్రోగ్రాం చెపట్టిన ప్రెసిడెంట్ బైడెన్ కు ధన్యవాదాలు. అందుబాటులో ఉండే నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలనే మా భాగస్వామ్య సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ఇండో- పసిఫిక్‌ కోసం క్వాడ్‌ వ్యాక్సిన్‌ చొరవ తీసుకున్నాం. అందుకు నేను సంతోషిస్తున్నా. క్వాడ్‌లో గర్భాశయ క్యాన్సర్‌ వంటి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవాలని నిర్ణయించాం. క్యాన్సర్ నివారణకు అన్ని దేశాల మద్దతు అసరం’ అని మోడీ అన్నారు.

బైడెన్ ఏమన్నారంటే?

‘‘ప్రతి సంవత్సరం ఇండో- పసిఫిక్‌లో గర్భాశయ క్యాన్సర్‌తో 1,50,000 మంది మహిళలు మరణిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నేతలు, అనేక సంస్థలు హెచ్‌పీబీ స్క్రీనింగ్‌, థెరప్యూటిక్స్‌కు 150 మిలియన్ల డాలర్లకు పైగా వెచ్చిస్తున్నారు. వచ్చే ఏడాది యూఎస్‌ నేవీకి చెందిన వైద్యులు, నర్సులు ఇండో- పసిఫిక్‌ సహచరులకు గర్భాశయ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, వ్యాక్సినేషన్‌ నిర్వహించడంలో శిక్షణ ఇస్తారు’’ అని బైడెన్‌ అన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో ప్రపంచ నేతలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. 2016లో తొలిసారిగా మూన్‌షాట్‌ క్యాన్సర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్‌పై పరిశోధనను వేగవంతం చేసేందుకు రోగులు, వైద్యులు, పరిశోధనా సంఘాల్ని ఒకచోట చేర్చారు. ఇప్పటి వరకు ఐదు వేర్వేరు దేశాల్లో 95 కార్యక్రమాలు నిర్వహించారు.

Next Story

Most Viewed