కోవిడ్ సర్టిఫికేట్‌ల నుంచి ప్రధాని మోడీ ఫోటో మిస్సింగ్

by S Gopi |
కోవిడ్ సర్టిఫికేట్‌ల నుంచి ప్రధాని మోడీ ఫోటో మిస్సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ కొవిషీల్డ్ తీసుకున్నవారికి అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రాజెనెకా కంపెనీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 టీకా తీసుకున్నవారికి ప్రభుత్వం ఇచ్చే కొవిన్ సర్టిఫికేట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చలు, ఆందోళనలు కొనసాగుతున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, దేశంలో లోక్‌సభ ఎన్నికల నియమావళిని పరిగణలోకి తీసుకుని కొవిన్ సర్టిఫికేట్‌లో మోడీ ఫోటోను తొలగించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాల ప్రకారం కొవిన్ సర్టిఫికేట్ నుంచి మోడీ ఫోటోను తీసేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డిజిటల్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో వ్యవహారం ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా పెద్ద చర్చకు నిలిచింది. కాగా, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనెకా కంపెనీ యూరప్ దేశాల్లో వాక్స్‌జెవెరియా పేరుతో సరఫరా అవుతోంది. ఇదే భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో అందిస్తోంది. దేశీయంగా ఈ టీకాను సీరమ్ సంస్థ తయారు చేస్తోంది.

Advertisement

Next Story