PM Modi : రేపు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం

by Hajipasha |
PM Modi : రేపు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. తొలుత ఉదయం 11 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌‌ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ కన్వర్జెన్స్ కౌన్సిల్ సంయుక్తంగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో దాదాపు 800 మంది ప్రముఖులు ప్రసంగించనున్నారు. వక్తల జాబితాలో సీనియర్ బ్యాంకర్లు, ఫిన్‌టెక్ కంపెనీల ముఖ్యులు, ఆర్థిక రంగ నిపుణులు ఉన్నారు. ఫిన్‌టెక్ రంగంలో అందుబాటులోకి వచ్చిన నూతన ఆవిష్కరణలను ఈసందర్భంగా ప్రదర్శించనున్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రధాని మోడీ పాల్‌ఘర్ పట్టణానికి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

పాల్‌ఘర్ జిల్లా దహను పట్టణం సమీపంలో తలపెట్టిన వాధ్వాన్ పోర్ట్ నిర్మాణ పనులకు మోడీ శ్రీకారం చుడతారు. ఈసందర్భంగా శంకుస్థాపన పూజలను నిర్వహిస్తారు. దాదాపు రూ.76వేల కోట్లతో ఈ పోర్ట్‌ను నిర్మించనున్నారు. శుక్రవారం రోజునే జాతీయ స్థాయి వెసెల్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్ సిస్టమ్‌ను కూడా ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. దీనిలో భాగంగా విడతల వారీగా దేశంలోని 13 తీర ప్రాంత రాష్ట్రాల్లోని మత్స్యకారులకు చెందిన మెకనైజ్డ్, మోటారైజ్డ్ ఫిషింగ్ బోట్లకు 1 లక్ష ట్రాన్స్‌పాండర్లను అమర్చనున్నారు. ఈ ట్రాన్స్‌పాండర్లను ఇస్రో తయారు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో, సముద్ర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించే క్రమంలో మత్స్యకారులతో కమ్యూనికేషన్ చేయడానికి ఈ ట్రాన్స్‌పాండర్లు ఉపయోగపడతాయి.

Advertisement

Next Story

Most Viewed