Pm modi: మూడు కుటుంబాలే జమ్మూ కశ్మీర్‌ను నాశనం చేశాయి.. ప్రధాని మోడీ

by vinod kumar |
Pm modi: మూడు కుటుంబాలే జమ్మూ కశ్మీర్‌ను నాశనం చేశాయి.. ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)లు రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూ కశ్మీర్ భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. గురువారం శ్రీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ మూడు పార్టీల కుటుంబాలే కశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా మారాయన్నారు. ఈ వ్యక్తులు తమ స్వలాభం కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేశాయని విమర్శించారు. మరో తరాన్ని నాశనం చేయడానికి తాను అనుమతించబోనని స్పష్టం చేశారు. కశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే మోడీ ఉద్దేశమని, ఎన్నికల అనంతరం తప్పకుండా ఈ హామీని నెరవేర్చుతానని తెలిపారు. ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని చెప్పారు.

జమ్మూ కశ్మీర్ అంతటా ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు సజావుగా నడుస్తున్నాయని, పిల్లల వద్ద పెన్నులు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు మాత్రమే కనపడుతున్నాయన్నారు. కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీలు రాజవంశ రాజకీయాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం తమ జన్మహక్కు అని మూడు కుటుంబాలు భావిస్తున్నాయన్నారు. అందుకే కశ్మీర్‌లో భయాన్ని, అరాచకాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రపాలిత ప్రాంతంలోని యువత విద్య, ఉపాధికి దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలిదశ ఎన్నికల్లో ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరిగిందని, ఎన్నికల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ల నుంచి బయటకు రావడం సంతోషకరమని కొనియాడారు. కాగా, గత ఆరు రోజుల్లో ప్రధాని మోడీ కశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు సెప్టెంబర్ 14న దోడా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed