మణిపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజలు

by Harish |   ( Updated:2024-06-28 10:20:21.0  )
మణిపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల అల్లర్లతో అట్టుడికిపోయిన మణిపూర్‌‌లో ప్రస్తుతం పరిస్థితులు కొంత వరకు శాంతించినట్లు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం రాజధాని ఇంఫాల్ లోయలో కుకీయేతర తెగలతో సహా అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా సమావేశమై రాష్ట్ర ప్రాదేశిక, పరిపాలన సమగ్రత కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ సమగ్రత సమన్వయ కమిటీ (COCOMI) ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని థౌ మైదానంలో ప్రారంభమై ఖుమాన్ లంపాక్ స్టేడియం వరకు దాదాపు 5 కి.మీ పొడవున సాగింది. పాఠశాల, కళాశాల విద్యార్థులు, మహిళలు, యువకులు, గ్రామ వాలంటీర్లు ఊరేగింపులో పాల్గొని పొరుగున ఉన్న మయన్మార్‌ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారతదేశంలోని స్వదేశీ, నిజమైన సరైన పౌరులను రక్షించండి, ప్రత్యేక పరిపాలన లేదు, మణిపూర్ ప్రాదేశిక సమగ్రతను కాపాడండి వంటి నినాదాలతో పోస్టర్లు, బ్యానర్‌లను చేతిలో పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. మయన్మార్, మిజోరం సరిహద్దుల్లో ప్రత్యేక పరిపాలన కోసం పోరాడుతున్న కుకీ తెగల వారు మినహా - మిగిలిన అన్ని వర్గాల మణిపూర్ ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. వారు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) కసరత్తును నిర్వహించడం, కుకీ తిరుగుబాటు గ్రూపులతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయడం, మణిపూర్ పరిపాలన సమగ్రతను కాపాడటం వంటి డిమాండ్లను వ్యక్తపరిచారు. కుకీ, మైతీ తెగల మధ్య గత కొంత కాలంగా అల్లర్లు చోటుచేసుకుంటున్నాయి. ఈ హింస కారణంగా మణిపూర్‌లో 200 మంది చనిపోగా, వేలాది మందిని నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story

Most Viewed