మరీ అంత అమాయకులు కాదు.. బాబారాందేవ్ పై ఫైర్ అయిన సుప్రీం కోర్టు

by Shamantha N |   ( Updated:2024-04-16 12:08:11.0  )
మరీ అంత అమాయకులు కాదు.. బాబారాందేవ్ పై ఫైర్ అయిన సుప్రీం కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కోర్టు ధిక్కరణ కేసులో పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌, పతంజలి ఎండీ బాలకృష్ణపై సుప్రీం కోర్టు మరోసారి ఫైర్ అయ్యింది. గత ఉత్తర్వుల్లో ఏం చెప్పామో తెల్సుకోలేనంత అమాయకులేం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద మెడిసిన్ కు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. బాబా రాందేవ్, బాలకృష్ణ ఇద్దరూ వ్యక్తిగతంగా సుప్రీంకోర్టుకి హాజరయ్యారు.

తాము చేసిన తప్పిదాలకు బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నామని రాందేవ్ బాబా కోర్టుకి తెలిపారు. ఆ సమయంలో తాము చేసింది సరైంది కాదని స్పష్టం చేశారు. చేసిన తప్పును భవిష్యత్తులో కూడా మళ్లీ జగరకుండా గుర్తు పెట్టుకుంటామని బాబా రాందేవ్‌ కోర్టుకు విన్నవించారు

బాబా రాందేవ్ క్షమాపణలపై జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ ఏ అమానుల్లాతో కూడిన సుప్రీకోర్టు ధర్మాసనం స్పందించింది. గత ఉత్తర్వుల్లో మేం ఏం చెప్పామో తెలియనంత అమాయకులేం కాదు మీరని రాందేవ్ బాబా, బాలకృష్ణను ఉద్దేశించి పేర్కొంది. నయం చేయలేని వ్యాధులపై ప్రకటనలు ఇవ్వకూడదని తెలియదా? వారిది బాధ్యతారాహిత్యం అని మండిపడింది కోర్టు. చేసేది మంచి పనే అయినా.. అల్లోపతీని తగ్గించి చూపించకూడదని స్పష్టం చేసింది. వారి క్షమాపణలను పరిశీలిస్తామని.. అయితే ఇప్పుడే ఈకేసు నుంచి విముక్తి కల్పించలేమని పేర్కొంది. దీనిపై వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెబుతూ ప్రకటనలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈకేసు తదుపరి విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది.

హల్లోపతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను హెచ్చరించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. దీన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అయితే ఈ ఆదేశాలను పతంజలి బేఖాతరు చేయడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed