కోచింగ్ సెంటర్ పై కూడా బుల్డోజర్ వాడతారా?- అఖిలేష్ యాదవ్

by Shamantha N |
కోచింగ్ సెంటర్ పై కూడా బుల్డోజర్ వాడతారా?- అఖిలేష్ యాదవ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘సరైన ప్లానింగ్‌ లేని ఇలాంటి భవనాలకు నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడం కచ్చితంగా సంబంధిత అధికారుల బాధ్యారాహిత్యం. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది..? ప్రభుత్వంపై లేదా..? మరి బాధ్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేస్తుంది..?’ అని అఖిలేష్‌ యాదవ్‌ ప్రశ్నించారు. ఇది అక్రమ కట్టడానికి సంబంధించిన సమస్య కాదని, ఇలాంటి బిల్డింగ్ లు ఎన్నో ఢిల్లీలో ఉన్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాలపై బీజేపీ సర్కారు ఎన్నో బిల్డింగులను బుల్డోజర్‌లు పెట్టి కూల్చివేయించిందని గుర్తుచేశారు. మరి ఢిల్లీలో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు కేంద్ర సర్కారు బుల్డోజర్‌లను వినియోగిస్తుందా లేదా..? అని అఖిలేష్‌ యాదవ్‌ నిలదీశారు.

ఆప్ పై బీజేపీ ఎంపీ విమర్శలు

బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ లోక్ సభలో ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. "ఆ విద్యార్థులు ఐఏఎస్ పరీక్షల ప్రిపరేషన్ కోసం ఢిల్లీలో ఉన్నారు. పాపం.. ఢిల్లీ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు. దశాబ్ద కాలంగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ప్రజల కోసం పనిచేయట్లేదు. ఆప్ ఆధ్వర్యంలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జలబోర్డుకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే, కౌన్సిలర్, అధికారులకు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు” అని ఆరోపించారు. “ఈ కేసు దర్యాప్తు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తున్నాను" అని అన్నారు.

శశిథరూర్ ఏమన్నారంటే?

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరణించిన విద్యార్థుల్లో ఒకరు తమ రాష్ట్రానికి చెందినవారని గుర్తుచేశారు. ప్రాణాంతక సంఘటనకు దారితీసిన లోపాలకు జవాబుదారీగా ఉండాలని కోరారు. దేశానికి సేవ చేయాలనుకునే "మేధావి విద్యార్థి" ప్రాణనష్టాన్ని ఎలాంటి ఎక్స్ గ్రేషియా భర్తీ చేయలేమని ఆయన అన్నారు. "పరిష్కరించవలసిన అనేక తీవ్రమైన సమస్యలు ఉన్నాయి - బిల్డింగ్ కోడ్స్, అగ్నిమాపక భద్రత, వరద భద్రత.. ఇలా ప్రాథమిక నిబంధనల ఉల్లంఘన ప్రబలంగా ఉంది " అని థరూర్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed