CAA : పాకిస్తానీ క్రైస్తవుడికి తొలి భారతీయ పౌరసత్వం

by Hajipasha |
CAA : పాకిస్తానీ క్రైస్తవుడికి తొలి భారతీయ పౌరసత్వం
X

దిశ, నేషనల్ బ్యూరో : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా భారత పౌరసత్వం పొందిన తొలి పాకిస్తానీ క్రైస్తవుడిగా 78 ఏళ్ల జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరా నిలిచారు. ఈయనకు బుధవారం రోజు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ భారత పౌరసత్వ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోవా సీఎం మాట్లాడుతూ.. జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరా కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. భారత స్వాతంత్య్రానికి ముందు గోవాలోనే పెరీరా జీవించే వారని.. ఆయన ఉన్నత చదువుల కోసం అప్పట్లో పాకిస్తాన్‌కు వెళ్లారని ప్రమోద్‌ సావంత్ తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం పాక్‌లోనే ఉండిపోవడంతో పెరీరాకు అక్కడి పౌరసత్వం లభించిందన్నారు.

ఈ క్రమంలో స్వదేశానికి తిరిగొస్తానని జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరా విజ్ఞప్తి చేయడంతో ఆయనకు సీఏఏ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని అందించినట్లు వెల్లడించారు. 2013 నుంచి జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పెరీరా గోవాలోనే ఉంటున్నారని సీఎం చెప్పారు. ఇంకా చాలామంది సీఏఏకు అర్హులైన వారు గోవాలో ఉన్నారని, వారంతా ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చన్నారు. 2014 డిసెంబరు 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు సీఏఏ ద్వారా భారత పౌరసత్వాన్ని అందిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed