Delhi coaching centre deaths: నెలక్రితమే ఫిర్యాదు.. మరో ఐదుగురు అరెస్టు..!

by Shamantha N |   ( Updated:2024-07-29 10:53:42.0  )
Delhi coaching centre deaths: నెలక్రితమే ఫిర్యాదు.. మరో ఐదుగురు అరెస్టు..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ (Coaching Centre) ప్రమాద ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో, ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య ఏడుకు చేరుకుంది. అరెస్టయిన వారిలో బిల్డింగ్ యజమానులు, కోచింగ్ సెంటర్ దగ్గర అతివేగంతో కారు నడిపిన వ్యక్తి ఉన్నారు. ఈ విషాదం జరిగిన ఐఏఎస్ స్టడీ సర్కిల్ యజమాని, కో ఆర్డినేటర్ ను పోలీసులు ఆదివారమే అరెస్టు చేశారు. వారిద్దరిని పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కాగా.. ఈ ఘటనలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టబోయేది లేదని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం హర్షర్ధన్ అన్నారు. నిందితులపై కఠిచర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రాజేంద్రనగర్ ప్రాంతంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

నెలక్రితమే ఫిర్యాదు

ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాద ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కన్పిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ప్రమాదానికి నెల ముందే ఇనిస్టిట్యూట్ పరిస్థితులపై అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. కిషోర్ సింగ్ కుష్వా అనే అభ్యర్థి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు లేఖ రాశాడు. “కోచింగ్ సెంటర్ నిర్వాహకులు విద్యార్థుల భవిష్యత్ తో ఆటలు ఆడుకుంటున్నారు. పార్కింగ్ లేదా స్టోరేజ్ కోసం సెల్లార్ ని వాడుకోవాలన్న ఎంసీడీ నిబంధనలను కోచింగ్ సెంటర్ పాటించడం లేదు. సెల్లార్ లోనే క్లాసులు, లైబ్రరీ నిర్వహిస్తున్నారు. సిబ్బంది, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి” అని కిషోర్ సింగ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, ఈ ఫిర్యాదు విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్లు ఆయన చేసిన ఆన్ లైన్ పోర్టల్ స్టేటస్ లో చూస్తే తెలుస్తోంది. దీనిపైన ఇప్పటి వరకు అధికారులెవరూ స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed