భారత ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెలీ కంపెనీ కుట్ర : ఓపెన్‌ ఏఐ నివేదిక

by Hajipasha |
భారత ఎన్నికల్లో జోక్యానికి ఇజ్రాయెలీ కంపెనీ కుట్ర : ఓపెన్‌ ఏఐ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతదేశ సార్వత్రిక ఎన్నికలపై ఛాట్‌జీపీటీ మాతృ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ సంచలన నివేదికను విడుదల చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎస్‌టీ‌ఓఐసీ(STOIC) కంపెనీ బీజేపీ వ్యతిరేక ఎజెండాతో భారత ఎన్నికల్లో జోక్యం చేసుకొని, పెద్దఎత్తున ప్రజాభిప్రాయాన్ని మార్చాలని యత్నించిందని తెలిపింది. తాము ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని ఓపెన్‌ ఏఐ వెల్లడించింది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలీజెన్స్‌ టెక్నాలజీ సాయంతో వెబ్‌ ఆర్టికల్స్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల్లో కామెంట్ల ద్వారా భారత ఓటర్లను ప్రభావితం చేసేందుకు సదరు ఇజ్రాయెలీ కంపెనీ కుట్రపన్నిందని నివేదిక పేర్కొంది.

ఈ ప్రయత్నాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌‌కు అనుకూలంగా మార్చాలని ఎస్‌టీ‌ఓఐసీ(STOIC) కంపెనీ భావించిందని ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఈ క్యాంపెయిన్‌‌ను ఎస్‌టీ‌ఓఐసీ ప్రారంభించిన 24 గంటల్లోనే తాము గుర్తించి అడ్డుకున్నామని చెప్పింది. ఎక్స్‌, మెటా వంటి సోషల్ మీడియా సంస్థలు కూడా ఆయా అకౌంట్లను తొలగించాయని పేర్కొంది. ఫలితంగా ఇజ్రాయెలీ కంపెనీ క్యాంపెయిన్‌ పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయిందని స్పష్టం చేసింది. ఓపెన్‌ఏఐ విడుదల చేసిన ఈ సంచలన నివేదికపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పందించారు. ప్రజాస్వామ్యానికి ఇలాంటివి ప్రమాదకరమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు దేశంలోనూ, వెలుపల ఈ తరహా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ నివేదికను ఇంకాస్త ముందుగా వెలువరిస్తే బాగుండేదని, ఇప్పటికే ఎన్నికలు తుది విడతకు చేరాయని రాజీవ్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Advertisement

Next Story