మరోసారి ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్: 21 మందిని రక్షించిన ఐఎన్ఎస్ కోల్‌కతా

by samatah |
మరోసారి ఇండియన్ నేవీ డేరింగ్ ఆపరేషన్: 21 మందిని రక్షించిన ఐఎన్ఎస్ కోల్‌కతా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ నేవీ మరోసారి డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. దాడికి గురైన మరో వాణిజ్య నౌకను రక్షించింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో బార్భడోస్‌కు చెందిన ‘ట్రూ కాన్పిడెన్స్’ అనే నౌకపై హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కోల్‌కతా వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. నౌకలో ఉన్న ఓ భారతీయుడితో సహా 21 మంది సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. ఇండిన్ నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ గురువారం తెలిపారు. గాయపడిన సిబ్బందికి చికిత్స అందించినట్టు పేర్కొన్నారు. నౌకపై హౌతీలు క్షిపణితో దాడి చేసినట్టు వెల్లడించింది. యెమెన్‌లోని ఓడరేవు నగరం ఏడెన్‌కు నైరుతి దిశలో దాదాపు 55 నాటికల్ మైళ్లు (101 కిలోమీటర్ల) దూరంలో ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. అయితే హౌతీల దాడిలో ముగ్గురు సిబ్బంది మరణించగా.. ఆరుగురు గాయపడ్డట్టు యూఎస్ కమాండ్ కంట్రోల్ తెలిపింది. కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనియన్లకు మద్దతుగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై నిరంతరం దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed