అత్యంత వృద్ధ ఎంపీ షఫీకర్ రెహ్మాన్ కన్నుమూత

by samatah |
అత్యంత వృద్ధ ఎంపీ షఫీకర్ రెహ్మాన్ కన్నుమూత
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత పార్లమెంటులో అత్యంత వృద్ధ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) సీనియర్ నాయకుడు షపీకర్ రెహ్మాన్ బార్క్ (94) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ మొరాదాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి మంగళవారం తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఎస్పీ సీనియర్ నేత, ఎంపీ షఫీకర్ రెహ్మాన్ బార్క్ సాహెబ్ మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని రెహ్మాన్ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం’ అని సమాజ్ వాదీ పార్టీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అలాగే ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ లోక్ దళ్ నాయకులు జయంత్ చౌదరిలు కూడా రెహ్మాన్ మృతి పట్ల సంతాపం తెలిపారు. అత్యంత సీనియర్ రాజకీయ వేత్త అయిన రెహ్మాన్ బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్‌గా కూడా పనిచేశాడు.

రెహ్మాన్ ప్రస్థానం

రెహ్మాన్ 1930 జూలై 11న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జన్మించాడు.1974లో ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. ఆ సంత్సరం తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998, 1999, 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఎంపీగా ఓడిపోయినప్పటికీ.. 2019లో తిరిగి ఎస్పీ తరఫున సంబాల్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై లోక్‌సభలో అత్యంత వృద్ధ ఎంపీగా ఉన్నారు. మొత్తంగా ఐదు సార్లు ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. గత నెల 30న ఎస్పీ రిలీజ్ చేసిన 16 మంది లోక్ సభ అభ్యర్థుల జాబితాలోనూ షపీకర్ పేరు ఉండటం గమనార్హం. అంతేగాక దేశవ్యాప్తంగా ముస్లిం సమాజ పరిస్థితులపై గళమెత్తి ముస్లిం నాయకుడిగా రెహ్మాన్ పేరు తెచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ స్థాపించిన సమయంలో ములాయం సింగ్ యాదవ్‌తోనూ సన్నిహితంగా పనిచేశారు.

Advertisement

Next Story

Most Viewed