250 గుడిసెలు నేలమట్టం.. బీజేపీ సర్కార్ బుల్డోజర్‌ చర్య

by Vinod kumar |
250 గుడిసెలు నేలమట్టం.. బీజేపీ సర్కార్ బుల్డోజర్‌ చర్య
X

చండీగఢ్ : నాలుగు రోజుల క్రితం మత అల్లర్లు జరిగిన హర్యానా రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రియాక్షన్ మొదలుపెట్టింది. నూహ్‌ జిల్లాల్లోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్‌ చర్యను చేపట్టింది. హింసాకాండకు గురైన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని టౌరు ఏరియాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నివసిస్తున్న వలసదారుల 250 గుడిసెలను అధికారులు కూల్చేశారు. అల్లర్లకు పాల్పడిన వారికి చెందిన నిర్మాణాలుగా భావించి.. ఆ ఇళ్లను బుల్డోజర్‌‌తో కూల్చారని తెలుస్తోంది. స్వయంగా సీఎం ఖట్టరే ఈ కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ పోలీసు, పారామిలటరీ బలగాల మోహరింపు మధ్య బుల్డోజర్ చర్య జరిగింది. పలు ప్రభుత్వ శాఖల అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు.

బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలస వచ్చి ఇంతకుముందు వరకు అస్సాంలో నివసించిన శ‌ర‌ణార్థులు.. గత నాలుగు సంవత్సరాలుగా హర్యానా అర్బన్ అథారిటీ భూమిలో నివసిస్తున్నారు. నూహ్‌ జిల్లా తౌరు పట్టణంలోని మహ్మద్‌పూర్ రహదారి మార్గంలో వార్డు నంబర్ 1లోని హర్యానా అర్బన్ అథారిటీకి చెందిన ఎకరం భూమిలో వారు 250కిపైగా గుడిసెలు వేసుకున్నారు. మరోవైపు ఉద్రికతలు నెలకొన్న నేపథ్యంలో గురుగ్రామ్‌ మసీదులలో శుక్రవారం ప్రార్ధనలు (జుమ్మా నమాజ్‌) నిలిపివేస్తున్నట్లు మత పెద్దలు ప్రకటించారు. ప్రజలు తమ్మ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed