మహిళపై భర్త సోదరుడి అత్యాచారం.. చంపేందుకు యత్నించిన భర్త

by Hajipasha |
మహిళపై భర్త సోదరుడి అత్యాచారం.. చంపేందుకు యత్నించిన భర్త
X

దిశ, నేషనల్ బ్యూరో : మనుషుల్లో నైతిక విలువలు పతనం అవుతున్నాయి. వావి వరుసలను మరిచి కొందరు నీచులు ప్రవర్తిస్తున్న తీరు యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 2న భర్త ఇంట్లో లేని సమయంలో ఓ మహిళపై భర్త సోదరుడు అత్యాచారం చేశాడు. అయితే భర్త ఇంటికి తిరిగొచ్చాక ఈ ఘోరం గురించి బాధిత మహిళ చెప్పుకుంది. అత్యాచారం చేసిన వీడియోను కూడా అతగాడు చిత్రీకరించాడని వివరించింది. ఇది విన్న వెంటనే ఆ మహిళ భర్త రాక్షసుడిలా ప్రవర్తించాడు. తన సోదరుడిని నిలదీయాల్సింది పోయి.. భార్య ఛాతీపైనే కూర్చొని ఆమె గొంతు కోసేందుకు యత్నించాడు. అంతేకాదు.. ‘‘ఇక నుంచి నువ్వు నా భార్యవు కాదు.. నా వదినవు’’ అని ప్రకటించాడు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఆమె గదిలోకి భర్త, అతడి సోదరుడు కలిసి ప్రవేశించారు. దుపట్టాతో ఆమె గొంతు పిసికి చంపేందుకు భర్త యత్నిస్తుండగా.. ఇదంతా భర్త సోదరుడు ఫోన్‌లో వీడియో రికార్డు చేశాడు. ఎలాగోలా వాళ్ల బారి నుంచి తప్పించుకొని ఆ మహిళ వీడియోను పోలీసులకు షేర్ చేయడంతో కేసు నమోదైంది. ఖతౌలీ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో సదరు మహిళ భర్త, అతడి సోదరుడిపై కేసు నమోదైంది. వారిని అరెస్టు చేసి త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Next Story