'ప్రతి న్యాయమూర్తికి టెక్నాలజీ తెలిసి ఉండాలి'

by Vinod kumar |
ప్రతి న్యాయమూర్తికి టెక్నాలజీ తెలిసి ఉండాలి
X

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని హైకోర్టుల్లో వర్చువల్‌గా విచారణలు కొనసాగించాలని, ప్రతి న్యాయమూర్తి సాంకేతికంగా నైపుణ్యం కలిగి ఉండాలని సుప్రీంకోర్టు శుక్రవారం పునరుద్ఘాటించింది. విచారణల కోసం పంజాబ్, హర్యానా హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేసిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించి గతంలో విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులు, ట్రిబ్యునళ్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇలా పేర్కొంది. ‘న్యాయమూర్తికి సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదా అనేది సమస్య కాదు. ఈ దేశంలో న్యాయమూర్తిగా ఉండాలంటే.. టెక్-ఫ్రెండ్లీగా ఉండాలి లేదా టెక్నాలజీ వాడకంపై తగిన ట్రైనింగ్ అయినా తీసుకోవాలి. ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణ పొందిన సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా ఇది వర్తిస్తుంది’ అని తెలిపింది. మొత్తానికి సాంకేతికత అనేది ఆప్షన్ కాదు, అవసరమైన సాధనం అని సీజేఐ నొక్కి చెప్పారు.

Advertisement

Next Story