అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఎల్‌కే అద్వానీకి నో ఎంట్రీ.. మరో కీలక నేతకు కూడా..!

by Nagaya |   ( Updated:2023-12-19 11:40:18.0  )
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఎల్‌కే అద్వానీకి నో ఎంట్రీ.. మరో కీలక నేతకు కూడా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి బిగ్ షాక్ తగిలింది. ఆయనతోపాటు కమలం పార్టీ సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషికి కూడా ఝలక్ ఇచ్చారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావద్దని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారిద్దరిని కోరింది. దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతూ అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం పోరాటాలు చేసి జైలు జీవితం గడిపిన ఈ ఇద్దరు నేతలను కీలక ఘట్టానికి రావద్దని చెప్పడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కనీసం వారిద్దరికి ఆహ్వాన పత్రికలు కూడా ఇవ్వకుండా శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అవమానించిందని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

అయితే దీనిపై శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఓ క్లారిటీ ఇచ్చింది. 22 జనవరి 2024న నిర్వహించే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను ఆహ్వానించలేదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దానికి ప్రధాన కారణం వారి వయసే అని పేర్కొంది. అద్వానీకి 96, జోషికి 89 ఏళ్లు ఉన్నాయని, ఈ వృద్ధాప్యంలో వేలాది మంది హాజరయ్యే కార్యక్రమానికి వాళ్లు వస్తే ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురవుతాయనే వద్దన్నామని వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ ఇద్దరు నేతలను కలిసి వివరించామని, దానికి వాళ్లు సానుకూలంగా స్పందించారని ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు.

కాగా, ఇదే కార్యక్రమానికి 90 ఏళ్లు వయసున్న దేవెగౌడను ఆహ్వానించిన శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ మందిరానికి ఇటుకలు సేకరించిన నేతలు, రామాలయం నిర్మాణానికి మూల స్తంభాల్లాంటి ఎల్‌కే అద్వానీ, జోషిలను పిలవకపోవడం అవమానకమేనని బీజేపీలోని కొందరు నేతలు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా విమర్శలకు దారితీస్తోంది.

Advertisement

Next Story

Most Viewed