'కూటమి ఐక్యంగానే ఉంది'.. వారితో వెళ్లిపోయిన ఎమ్మెల్యేలతో ఎన్సీపీకి సంబంధం లేదు : Sharad Pawar

by Vinod kumar |
కూటమి ఐక్యంగానే ఉంది.. వారితో వెళ్లిపోయిన ఎమ్మెల్యేలతో ఎన్సీపీకి సంబంధం లేదు : Sharad Pawar
X

ముంబై : అజిత్‌ పవార్‌‌తో కలిసి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలతో ఎన్సీపీకి ఎలాంటి సంబంధమూ ఉండబోదని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తేల్చి చెప్పారు. మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఐక్యంగానే ఉందన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో జరిగే విపక్ష కూటమి ‘ఇండియా’ సమావేశానికి తాను, ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ నానా పటోలే కలిసి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అజిత్‌ పవార్‌తో ఆదివారం పుణేలో శరద్‌ పవార్‌ భేటీ అయ్యారు. దీనిపై కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ నానా పటోలే స్పందిస్తూ.. ఏదో జరుగుతోందని కామెంట్ చేశారు. ఇక ఈ భేటీపై అభ్యంతరం తెలుపుతూ శివసేన (ఉద్ధవ్) పార్టీ పత్రిక సామ్నాలోనూ సోమవారం ఎడిటోరియల్ పబ్లిష్ అయింది. ఈ సందేహాలను నివృతి చేసేందుకు శరద్ పవార్ బారామతిలో మీడియాతో మాట్లాడారు.

అజిత్ పవార్‌తో భేటీపై పదేపదే ప్రశ్నలు అడుగుతూ గందరగోళం సృష్టించవద్దని మీడియాకు సూచించారు. "మణిపూర్ పక్కన ఒక దేశమే ఉంది. అలాంటి సున్నితమైన చోట ఉన్న రాష్ట్రంలో హింసాకాండను చిన్నగా చూడలేం. అందుకే దీన్ని ఇండియా కూటమి పార్టీలు పార్లమెంటులో అంతగా లేవనెత్తాయి" అని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై రెండు గంటలకు పైగా ప్రసంగించినా మణిపూర్ అంశంపై పరిమితంగానే మాట్లాడారన్నారు. మోడీ ప్రసంగం మణిపూర్ ప్రజలకు భరోసాను కల్పించేలా లేదని పవార్‌ అభిప్రాయపడ్డారు.

"గత తొమ్మిదేళ్లలో బీజేపీ ఏం చేసిందని.. 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ చేసిన దాన్ని ఇప్పుడు ప్రశ్నిస్తోంది" అని శరద్ పవార్ నిలదీశారు. "ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ బీజేపీతో చేతులు కలిపే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై నిన్న పుణెలో అజిత్‌ పవార్‌తో సమావేశంలో చర్చించారా?" అని మీడియా ప్రశ్నించగా.. అలాంటి చర్చలేమీ జరగలేదని స్పష్టంచేశారు. "జయంత్‌ పాటిల్‌ సోదరుడికి ఈడీ నుంచి నోటీసులు అందినట్టు విన్నా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఇలా నోటీసులు అందిన వాళ్లే ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపారు. జయంత్‌ పాటిల్‌ విషయంలో కూడా అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. అయితే సైద్ధాంతికంగా ఆయన వైఖరి స్పష్టంగా ఉందని అనుకుంటున్నా’’ అని ఎన్సీపీ చీఫ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed