నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరికీ మిత్రులే- సంజయ్ రౌత్

by Shamantha N |
నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరికీ మిత్రులే- సంజయ్ రౌత్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదన్నారు. బీజేపీ ఇప్పుడు సంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీకి మెజారిటీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు కాషాయ పార్టీ పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం వాళ్లను ప్రయత్నించనివ్వండి అని మోడీని ఉద్దేశించి చురకలు అంటించారు. చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌లు అందరికీ మిత్రులే అని వ్యంగ్యంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తెచ్చే బీజేపీకి నితీశ్, చంద్రబాబు మద్దతివ్వాలని కోరుకోవట్లేదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

ఇండియా కూటమి నేతల భేటీ

ఢిల్లీలో ఇండియా కూటమిలోని పార్టీల నేతల సమావేశమయ్యారు. తేజస్వి యాదవ్, సంజయ్ రౌత్, ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్ పవార్ ఈ భేటీకి హాజరయ్యారు. ఎంకే స్టాలిన్, చంపా సోరెన్, అఖిలేష్ యాదవ్, అభిషేక్ బెనర్జీ, సీతారాం ఏచూరి, డి. రాజా కూడా సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయింది. దీంతో, ఇండియా కూటమి సైతం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడులతో విపక్ష ఇండియా కూటమి సంప్రదింపులు జరుపుతారనే ప్రచారం జరుగుతోంది.

‘వెయిట్ అండ్ వాచ్’

విప‌క్ష ఇండియా కూట‌మి భేటీకి వెళ్లిన ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌దుప‌రి ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యంలో ఏం జ‌రుగుతుందో వేచిచూడాల‌ని పేర్కొన్నారు. తేజ‌స్వి యాద‌వ్‌, ఎన్డీయే భేటీలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన నితీష్ కుమార్‌లు ఒకే విమానంలో ప్ర‌యాణించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు జ‌రిగాయ‌నే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక, ఈ విష‌య‌మై తేజ‌స్వి యాద‌వ్‌ను ప్రశ్నించగా వెయిట్ అండ్ వాచ్ అని బదులిచ్చారు. మరోవైపు, ఢిల్లీ చేరుకున్న నితీష్ కుమార్.. ఎన్డీఏ ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంద‌ని పేర్కొన్నారు.

మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం

ఇక ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలో మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ పావులు క‌దుపుతోంది. జూన్ 8న ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని ఎన్డీయే వ‌ర్గాలు తెలిపాయి. ఇప్పటికే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తన మంత్రి మండలితో కలిసి రాజీనామా సమర్పించారు. రాష్ట్రపతి ఈ రాజీనామాను ఆమోదించారు.

Advertisement

Next Story

Most Viewed