Road Accidents : ఆ ప్రస్తావన వస్తే తల దాచుకుంటాను.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
Road Accidents : ఆ ప్రస్తావన వస్తే తల దాచుకుంటాను.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో రోడ్డు ప్రమాదాలు(Road Accidents) పెరిగాయని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) లోక్‌సభ వేదికగా ఒప్పుకున్నారు. మనుషుల ప్రవర్తనా శైలిలో మార్పు వచ్చి, చట్టాలను తు.చ తప్పకుండా పాటించే తత్వం అలవడితేనే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నేను రోడ్డు రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ అది సాధ్యం కాలేదు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపోగా మరింత పెరిగిపోయింది. అందుకే విదేశాల్లో అంతర్జాతీయ సదస్సులకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదాల అంశం వచ్చినప్పుడల్లా నేను తల దాచుకునేందుకు ప్రయత్నిస్తాను’’ అని గడ్కరీ పేర్కొన్నారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కొన్నేళ్ల క్రితం నేను, నా కుటుంబం కూడా రోడ్డు ప్రమాదం బారినపడ్డాం. ఆస్పత్రి పాలయ్యాం. చాలాకాలం చికిత్స పొందాం. దేవుడి దయతో కోలుకున్నాం. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాల వేదన ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు’’ అని గడ్కరీ తెలిపారు. ‘‘మన దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.78 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా చనిపోతున్న వారిలో 60 శాతం మంది 18 నుంచి 34 ఏళ్లలోపు వారే. గత ఏడాది వ్యవధిలో రోడ్డు ప్రమాదాల్లో యూపీలో అత్యధికంగా 23వేల మంది చనిపోయారు. తమిళనాడులో 18వేల మంది, మహారాష్ట్రలో 15వేల మంది, మధ్యప్రదేశ్‌లో 13వేల మంది చనిపోయారు’’ అని గడ్కరీ వివరించారు. మహా నగరాల వారీగా చూస్తే.. గత ఏడాది వ్యవధిలో ఢిల్లీలో అత్యధికంగా 1,400 మంది, బెంగళూరులో 915 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారన్నారు.

Advertisement

Next Story

Most Viewed