న్యూయార్క్‌లో దీపావళి సెలవు..

by Vinod kumar |
న్యూయార్క్‌లో దీపావళి సెలవు..
X

న్యూయార్క్: దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో స్కూళ్లకు సెలవు ఇస్తామని నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ సోమవారం ప్రకటించారు. చీకటిపై వెలుగు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకు వేలాది మంది న్యూయార్క్ ప్రజలు ప్రతి సంవత్సరం దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా స్కూళ్లకు సెలవు ప్రకటించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించింది. ఈ బిల్లుపై గవర్నర్ కాథీ హోచుల్ సంతకం చేస్తే చట్టంగా మారుతుంది. పాఠశాల సెలవుల క్యాలెండర్‌లో ‘బ్రూక్లిన్-క్వీన్స్ డే’ స్థానంలో దీపావళి రోజును సెలవుగా ప్రకటించారు. ఇది స్థానిక కుటుంబాలకు ముఖ్యమైన విజయంగా మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.

దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ చాలా కాలంగా పోరాడుతున్నారు. తన పోరాటం ఫలించినందుకు గర్వంగా ఉందని జెన్నిఫర్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది దీపావళి నవంబర్ 12వ తేదీన జరుపుకుంటారు. ఆ రోజు ఆదివారం కావడంతో దీపావళి సెలవు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వస్తుంది. ముస్లింల ప్రధాన పండుగలైన ఈద్-అల్-ఫితర్ (రంజాన్), ఈద్-అల్-అదా (బక్రీద్) రోజున కూడా న్యూయార్క్ స్కూళ్లకు 2015 నుంచి సెలవు ఇస్తున్నారు.

Advertisement

Next Story