Nepal: భారత్- నేపాల్ మధ్య మరోసారి చెలరేగిన భూవివాదం

by Shamantha N |
Nepal: భారత్- నేపాల్ మధ్య మరోసారి చెలరేగిన భూవివాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌- నేపాల్ మధ్య మరోసారి భూవివాదం చెలరేగింది. నేపాల్‌ (Nepal) సెంట్రల్‌ బ్యాంక్ భారత భూభాగాలతో ఉన్న కొత్త నోట్లను ముద్రించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. లిపులేక్‌, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలు ఖాట్మండుకు చెందినవే అని చెప్పుకొస్తుంది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్ లను జత చేసింది. దీనికి సంబంధించి ప్రింటింగ్‌ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది. ఆరు నెలల నుంచి ఏడాదిలోగా ప్రింటింగ్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. నేపాల్ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతినిధి దిల్‌రామ్‌ పోఖ్రాల్‌ ఈవిషయాన్ని వెల్లడించినట్లు ‘నేపాల్‌ఖబర్‌’ (Nepalkhabar.com) వెబ్‌సైట్‌ పేర్కొంది. నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహల్‌ నేతృత్వంలోని మంత్రివర్గం సరికొత్త మ్యాప్‌తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది.

2020లో సరికొత్త మ్యాప్ విడుదల

లిపులేక్‌, కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలను తమ భూభాగాలు పేర్కొంటూ నేపాల్‌ 2020లో సరికొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. అప్పటి నేపాల్ ప్రధాని కేపీ శర్మ వోలీ ప్రభుత్వం ఈ తీర్మానం చేసింది. దీనికి అప్పటి పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది. భారత్‌ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. ఆ దేశం అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్‌లను సరికొత్త మ్యాప్‌లతో భర్తీ చేయడం మొదలుపెట్టింది. సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లతో నేపాల్ మొత్తం 1,850 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటుంది.

Advertisement

Next Story