నేపాల్ లో ఉద్రిక్తత.. హిందూ దేశంగా ప్రకటించాలని ఉద్యమం

by Shamantha N |
నేపాల్ లో ఉద్రిక్తత.. హిందూ దేశంగా ప్రకటించాలని ఉద్యమం
X

దిశ, నేషనల్ బ్యూరో: నేపాల్‌లోఉద్రిక్తత నెలకొంది. నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలని ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు హోరెత్తాయి. నేపాల్ రాజధాని ఖాట్మాండులో వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను వాడారు. దశాబ్దంగా 16,000 మందికి పైగా ప్రజలు మరణించిన తర్వాత అంతర్యుద్ధానికి ముగింపు పలికి శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశ పార్లమెంట్ రాచరికాన్ని రద్దు చేశారు. 2008లో హిందూ మెజారిటీగా ఉన్న దేశం సమాఖ్య వ్యవస్థతో లౌకిక గణతంత్ర రాజ్యంగా అవతరించింది.

అయితే, దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని, హిందూ దేశంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. సమాఖ్య వ్యవస్థను రద్దు చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు. నేపాల్ పార్లమెంట్‌లో ఐదో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీ ప్రజాతంత్ర పార్టీయే ఈ డిమాండ్లను చేస్తోంది. ‘‘మన దేశం, మన రాజు మాకు ప్రాణం కంటే ప్రియమైనవారు’’ అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడిన తర్వాత వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ వాడినట్లు ఖాట్మండు పోలీసులు తెలిపారు.

నేపాల్‌లో రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థికాభివృద్ధి లేకపోవడంతో ఆ దేశంలోని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో రాజరికం కావాలని, హిందూ రాజ్యపునరుద్ధరణ జరగాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అధికారంలోని వారు అవినీతి, అన్యాయంతో తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. దేశ సంస్కృతి, గుర్తింపు కాపాడేందుకు రాజరికాన్ని పునరుద్ధరించడమే సరైందని నిరసనకారులు చెబుతున్నారు.

2001లో నేపాల్ యువరాజు దీపేంద్ర.. అతని తండ్రి రాజైన బీరేంద్రతో పాటు 10 మందిని హత్య కోశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాంటి పరిణామాల్లతో రాజుగా జ్ఞానేంద్ర షాని ఎన్నుకున్నారు. 76 ఏళ్ల జ్ఞానేంద్ర షానే నేపాల్ కి చివరి రాజు. అయితే, నేపాల్ రాజకీయాల్లో ఈయన చురుగ్గా లేడు. కాకపోతే రాచరికం పునరుద్ధరణకు మాత్రం పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed