అంగన్‌వాడీ జాబ్స్ ఆశచూపి.. 20 మందిపై గ్యాంగ్ రేప్ ?

by Hajipasha |   ( Updated:2024-02-11 11:43:20.0  )
అంగన్‌వాడీ జాబ్స్ ఆశచూపి.. 20 మందిపై గ్యాంగ్ రేప్ ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అంగన్‌వాడీ కేంద్రాల్లో జాబ్స్ ఇప్పిస్తామని బుకాయించారు. ఉద్యోగం ఆశచూపించి.. ఏమార్చి 20 మంది మహిళలపై కొందరు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాదు గ్యాంగ్ రేప్ ఘోరాలను వీడియో తీసి.. ఆ విషయాన్ని బయటపెడితే సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేస్తామని బాధిత వనితలను బెదిరించారు. అంతటితో ఊరుకోకుండా ఐదు లక్షలు చొప్పున చెల్లించాలంటూ అఘాయిత్యానికి గురైన మహిళలను బ్లాక్ మెయిల్ చేశారు. రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడిన వారికి రాజకీయ నేపథ్యం ఉండటంతో బాధిత మహిళలు తమకు జరిగిన అన్యాయంపై బహిరంగంగా మాట్లాడేందుకు సాహసించలేదు. అయితే పాలీ జిల్లాకు చెందిన ఓ బాధిత మహిళ సాహసించి పోలీసులను ఆశ్రయించింది. అంగన్ వాడీ కేంద్రాల్లో ఉద్యోగావకాశాలను కల్పిస్తామనే ఆశచూపించి.. తనతో పాటు దాదాపు 20 మంది మహిళలను మోసగించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది.

బాధిత మహిళ కథనమిదీ..

బాధిత మహిళ కథనం ప్రకారం.. ‘‘అంగన్‌వాడీ ఉద్యోగ అవకాశం కోసం నేను ఇతర మహిళలతో కలిసి చాలా నెలల క్రితం సిరోహి పట్టణానికి వెళ్లాను. జాబ్ ఛాన్స్ ఇప్పిస్తామని మమ్మల్ని పిలిచిన వాళ్లే భోజన వసతి, హాస్టల్ వసతి ఏర్పాటు చేశారు. అయితే వాళ్లు వడ్డించిన ఆహారంలో మత్తుమందులు ఉండటంతో తినగానే మేం మత్తులోకి జారుకున్నాం. ఆ తర్వాత మాపై లైంగిక వేధింపులు జరిగాయి’’ అని ఆమె ఆరోపించింది. స్పృహలోకి వచ్చిన తరువాత తాము మోసపోయామనే విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఇక ఈ ఫిర్యాదు చేసిన మహిళ గతంలో తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పరాస్ చౌదరి మీడియాకు తెలిపారు. అయినప్పటికీ ఇదే వ్యవహారంలో మరో 8 మంది మహిళలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని తమకు రాజస్థాన్ హైకోర్టు నుంచి ఆదేశం అందిందని, దానిపై విచారణ చేస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed