400 సీట్లొస్తే దేశంలో యూసీసీ అమలు : అసోం సీఎం

by Shamantha N |
400 సీట్లొస్తే  దేశంలో యూసీసీ అమలు : అసోం సీఎం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో యునిఫాం సివిల్ కోడ్ అమలు చేసేందుకు ఎన్డీఏ 400 సీట్లు గెలవాలని అన్నారు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ. బెగుసరాయ్ లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే యూసీసీ, కృష్ణ జన్మస్థలం, పీవోకేలపై ఆసక్తికర కామెంట్లు చేశారు. మథురలో కృష్ణ జన్మస్థానంలో భవ్య మందిరం నిర్మించేందుకు ఎన్డీఏ కచ్చితంగా 400పైగా సీట్లు గెలవాలని అన్నారు. పీఓకే భారత్ లో విలీనం చేయాలని.. అందుకోసం కూడా సీట్లు గెలవాలన్నారు.

మరోవైపు పీఓకే అంశం గురించి కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. పాక్ కు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే కాంగ్రెస్ నేత మణిసంకర్ అయ్యర్ పీఓకే సమస్యలు లేవనెత్తవద్దని పేర్కొన్నారు. పాక్ వద్ద అణుబాంబు ఉందని.. అందుకే పాక్ తో కయ్యాలు పెట్టుకోవద్దన్నారు. దీనిపైన హిమంత బిశ్వశర్మ ఘాటుగా స్పందించారు. పాక్ దగ్గరున్న న్యూక్లియర్ బాంబు ఎక్స్ పైర్ అయిపోయిందని భావిస్తున్నట్లు తెలిపారు. పీఓకే భారత్ లో విలీనం కావాలంటే మోడీ మూడోసారి అధికారంలోకి రావాలన్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత లాలూ అయోధ్య మందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేదని గుర్తుచేశారు. లాలూ, రాహుల్ ఈ ఇద్దరూ ఎప్పటికీ అయోధ్య మందిరాన్ని సందర్శించలేరన్నారు. కాంగ్రెస్ మత ఆధారిత రిజర్వేషన్లు కల్పిస్తోందని ఆరోపించారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే.. ఎన్డీఏ 400 సీట్లకు పైగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ముస్లిం ఆధారిత రిజర్వేషన్లు కల్పంచిందని.. దాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. అసోంలో బాల్యవివాహాలు, బహుభార్యాత్వంపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

ఇకపోతే, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బెగుసురాయ్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా బరిలో నిలిచారు. బిహార్‌లోని బెగుసరాయ్, దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, ముంగేర్ లోక్‌సభ స్థానాలకు నాలుగో దశలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed