ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే దూకుడు.. రిజల్ట్ కార్డ్ ఇదే

by Hajipasha |
ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే దూకుడు.. రిజల్ట్ కార్డ్ ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో : నరాలు తెగే ఉత్కంఠతో అందరూ ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు బాటలో ఉందనే దానిపై పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ అంచనా నివేదికలను రిలీజ్ చేశాయి. శనివారం సాయంత్రం పోలింగ్ ఘట్టం ముగియగానే దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఎగ్జిట్ పోల్స్‌ను చూసేందుకు టీవీలు, స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయారు. రిపబ్లిక్ - పీ మార్క్, మ్యాట్రిజ్, జన్ కీ బాత్, ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ అనే నాలుగు సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్‌లో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. మోడీ సేన మళ్లీ విజయఢంకా మోగించబోతోందని, కేంద్రంలో అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోబోతోందని ఈ నివేదికలు పేర్కొన్నాయి. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి రిపబ్లిక్ - పీ మార్క్ ప్రకారం 359 లోక్‌సభ సీట్లు, మ్యాట్రిజ్ ప్రకారం 353 నుంచి 368 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్డీయే కూటమికి జన్ కీ బాత్ ప్రకారం 377 సీట్లు, ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ ప్రకారం 371 సీట్లు రావచ్చు. ఈ నాలుగు సర్వేలు కూడా కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమికి 150కి మించి లోక్‌సభ సీట్లు రాకపోవచ్చని అంచనా వేయడం గమనార్హం.

దక్షిణాదిపై ఎగ్జిట్ పోల్ లెక్కలివీ..

ఈ ఎగ్జిట్ పోల్స్‌లో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సర్వే సంస్థలు అనూహ్యమైన ఫలితాలను విడుదల చేశాయి. వాటిని చూసిన చాలా మంది రాజకీయ పరిశీలకులు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ హవాయే వీస్తుందని సర్వేలు అంచనా వేశాయి. తెలంగాణలో బీజేపీకి 10, కాంగ్రెస్‌కు 8, బీఆర్ఎస్‌కు 1, మజ్లిస్‌కు 1 సీట్లు రావచ్చని ఇండియా టీవీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి 15, బీజేపీకి 6, వైఎస్సార్ సీపీకి 5, జనసేనకు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్ ఏపీలో ఎన్డీయే కూటమికి 25 సీట్లు, వైఎస్సార్ సీపీకి 4 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక్క సీటు కూడా రాదని పేర్కొనడం గమనార్హం. ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్ తెలంగాణలో ఎన్డీయేకు 7 నుంచి 9 సీట్లు, ఇండియా కూటమికి 7 నుంచి 9 సీట్లు వస్తాయని లెక్క కట్టింది. ఇక కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ సీట్లలో 25 ఎన్డీయే కూటమికే వస్తాయని ‘ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా’ అంచనా వేసింది.

తెలంగాణ, కర్ణాటకలో అంతలా సీన్ మారిందా ?

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో ఘన విజయాలను సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ హస్తం పార్టీ క్యాడర్ జోష్‌లో ఉంది. విపక్ష పార్టీల నుంచి కీలక నేతల చేరికతో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. ఈనేపథ్యంలో కీలకమైన ఈ రెండు రాష్ట్రాల్లో సర్వశక్తులు ఒడ్డిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలపై భారీ అంచనాలు పెట్టుకుంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బంపర్ మెజారిటీని సాధించింది. అయితే వైఎస్సార్ సీపీ ఘన విజయాన్ని సాధించి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో పబ్లిక్ మూడ్ మారినా మారి ఉండొచ్చు. కానీ కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్‌కు క్లియర్ కట్ మెజారిటీని అందించిన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇంతలోనే పబ్లిక్ మూడ్ బీజేపీకి అనుకూలంగా ఎలా మారుతుంది ? ఇది కామన్ సెన్స్ కలిగిన ప్రతి ఒక్కరి మదిని తొలిచే ప్రశ్న కొందరు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

‘ప్రజ్వల్ రేవణ్ణ’ దుమారం రేపినా..

ప్రత్యేకించి కర్ణాటక రాష్ట్రంలో ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంతో జేడీఎస్ ప్రతిష్ఠ దెబ్బతింది. ఈ ప్రభావం సహజంగానే జేడీఎస్‌తో జతకట్టిన బీజేపీపైనా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 28 సీట్లలో 25 ఎన్డీయే కూటమికి ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బాగా హైప్ ఉందని.. ఈ స్టేట్లలో బీజేపీకి అంత రేంజులో సీట్లు రాకపోవచ్చని వారు అంటున్నారు. బీజేపీకి కేరళలో 3 సీట్లు, తమిళనాడులో 7 సీట్లు వస్తాయని కొన్ని సర్వే సంస్థలు చెప్పడాన్ని పలువురు పరిశీలకులు తప్పుపడుతున్నారు. ఆ రాష్ట్రాల్లో కమలదళం బోణీ కొట్టే అవకాశం ఉంటుందని.. ఒకేసారి ఐదుకు మించి సీట్లను కూడగట్టే ఛాన్స్ ఉండదని విశ్లేషిస్తున్నారు. ఉత్తరాది రాజకీయాలతో పోలిస్తే దక్షిణాది రాజకీయాలు పూర్తిగా భిన్నమైన సమీకరణాలతో జరుగుతాయని గుర్తు చేస్తున్నారు.

ఉత్తరాదిలో ఇలా..

ఉత్తర భారతదేశంలో కీలకమైన ఢిల్లీలోనూ ఎన్డీయే కూటమి హవాయే వీస్తుందని చాలావరకు సర్వే సంస్థలు అంచనా వేశాయి. ‘ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా’ ప్రకారం.. ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాలకుగానూ దాదాపు 6 బీజేపీకే దక్కుతాయి. కేవలం ఒకే సీటు కాంగ్రెస్-ఆప్ కూటమికి వస్తుంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. రాజస్థాన్‌లోని మొత్తం 25 సీట్లలో దాదాపు 16 నుంచి 19 బీజేపీ ఖాతాలోకి చేరుతాయని పేర్కొంది. బిహార్‌లోని 40 సీట్లలో దాదాపు 33 కాషాయ పార్టీకి చేజిక్కే ఛాన్స్ ఉందని సర్వే రిపోర్టు అంచనా వేసింది.

*****

రిపబ్లిక్ టీవీ - పీ మార్క్

* ఎన్డీయే - 359

* ఇండియా - 154

* ఇతరులు - 30

*********

రిపబ్లిక్ టీవీ - మ్యాట్రిజ్

* ఎన్డీయే - 353 -368

* ఇండియా - 118-133

* ఇతరులు - 43-48

*************

జన్ కీ బాత్

* ఎన్డీయే - 377

* ఇండియా - 151

* ఇతరులు - 15

***

ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్

* ఎన్డీయే - 371

* ఇండియా - 125

* ఇతరులు - 47

************

న్యూస్ నేషన్

* ఎన్డీయే - 342 - 378

* ఇండియా - 120

* ఇతరులు - 10

*******

దైనిక్ భాస్కర్

* ఎన్డీయే - 281 - 350

* ఇండియా - 145-201

* ఇతరులు - 10

************

ఇండియా టీవీ

* ఎన్డీయే - 309 - 320

* ఇండియా - 104 -128

* ఇతరులు - 28 - 38

*************

ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా

* ఎన్డీయే - 361-401

* ఇండియా - 131-166

* ఇతరులు - 8-20

***************

ఏబీపీ - సీ ఓటర్

* ఎన్డీయే - 353-383

* ఇండియా - 152-182

* ఇతరులు - 04-12

*********

ఈటీజీ - టైమ్స్ నౌ

* ఎన్డీయే - 358

* ఇండియా - 152

* ఇతరులు - 33

**********

Advertisement

Next Story