Shivaji Maharaj Statue: మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం

by Shamantha N |
Shivaji Maharaj Statue: మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ విగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలోని రాజ్‌కోట్ కోటలో ఉన్న 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కుప్పకూలింది. సోమవారం బలమైన ఈదురుగాలులకు విగ్రహం కూలిపోయింది. ఈ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబర్ 4న ప్రధాని మోడీ ఆవిష్కరించారు. నేవీ డే సందర్భంగా మోడీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో, ఈ ఘటనపై నౌకాదళం విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై తక్షణమే విచారణ జరిపి వీలైనంత త్వరగా విగ్రహం మరమ్మతులు చేపట్టేందుకు ఒక బృందాన్ని నియమించినట్లు అధికారులు తెలిపారు. నేవీ, మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత నిపుణులు ప్రమాదానికి గల కారణాన్ని పరిశోధిస్తున్నారు.

కాంట్రాక్టర్ పై కేసు నమోదు

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ధ్వంసం ఘటనలో కాంట్రాక్టర్ జైదీప్ ఆప్టే, స్ట్రక్చరల్ కన్సల్టెంట్ చేతన్ పాటిల్‌లపై భారత న్యాయ స్మృతి 109, 110, 125, 318, 3(5) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సింధుదుర్గ్ పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం.. మహారాష్ట్ర పీడబ్ల్యుడీ అధికారులు కాంట్రాక్టర్ ఆప్టేకు ఆగస్టు 20న ఇ-మెయిల్ పంపారు. ఛత్రపతి విగ్రహం నట్‌ లు, బోల్ట్ లు తుప్పు పట్టాయని.. విగ్రహానికి హాని కలిగించవచ్చని హెచ్చరించారు. అయినప్పటికీ, కాంట్రాక్టర్ ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. మరోవైపు, ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే.. పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని.. భారత నావికాదళం ఏర్పాటు చేసిందన్నారు. ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం, ఆయన విగ్రహమే మనకు గుర్తింపు.. విగ్రహం డిజైన్‌ను కూడా నేవీ సిద్ధం చేసింది అని సీఎం గుర్తు చేశారు. ఈ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి.

Advertisement

Next Story

Most Viewed