బీజేపీ చీఫ్‌గా మరోసారి నడ్డా!..పదవీ కాలం పొడిగించే చాన్స్

by vinod kumar |
బీజేపీ చీఫ్‌గా మరోసారి నడ్డా!..పదవీ కాలం పొడిగించే చాన్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ చీఫ్‌గా జేపీ నడ్డా పదవీ కాలం మరోసారి పొడిగించే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో అంతర్గత ఎన్నికల ప్రక్రియ ఒక సుధీర్ఘమైందని, దానికి ప్రతి రాష్ట్ర యూనిట్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ ప్రక్రియను నడ్డానే చూస్తారని అధిష్టానం భావిస్తున్నట్టు పార్టీ సీనియర్ నాయకుడు తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. రాష్ట్ర కౌన్సిల్‌లోని 20 మంది సభ్యుల గ్రూపులు 15 ఏళ్లుగా పార్టీలో సభ్యుడిగా ఉన్న ఏ నాయకుడి పేరైనా అధ్యక్షుడిగా ప్రతిపాదించొచ్చు. దీనికి చాలా సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగించనున్నట్టు తెలుస్తోంది.

కాగా, 2020లో నడ్డా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం పలుమార్లు పొడిగించారు. ఆయన మూడేళ్ల పదవీ కాలం 2023 జనవరిలో ముగిసింది, అయితే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి కొనసాగించారు. అనంతరం 2024 జనవరితో పదవీ కాలం ముగిసినప్పటీకీ దానిని జూన్ 30 వరకు పెంచారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించనున్నట్టు తెలుస్తోంది. కాగా, నడ్డా ప్రస్తుతం కేంద్ర మంత్రిగానూ కొనసాగుతున్నారు. అయితే నడ్డా అనంతరం అధ్యక్షులుగా సీనియర్ నాయకులు శివరాజ్ సింగ్ చౌహాన్, ఖట్టర్‌ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వారు కేబినెట్ బెర్త్ దక్కించుకోవడంతో తదుపరి అధ్యక్షుడిగా ఎవరు నియమకమవుతారనే నమ్మకంపై ఉత్కంఠ నెలకొంది.

Next Story