Muizzu: భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు.. ఈనెల 6 నుంచి10 వరకు పర్యటన

by vinod kumar |
Muizzu: భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు.. ఈనెల 6 నుంచి10 వరకు పర్యటన
X

దిశ, నేషనల్ బ్యూరో: మాల్దీవుల అధ్యక్షుడు మహహ్మద్ ముయిజ్జు ఈ నెల 6 నుంచి 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం వెల్లడించింది. ముయిజ్జు పర్యటనతో భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింత పెంపొందుతుందని తెలిపింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ ముయిజ్జు భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని మాల్దీవుల ప్రజలతో ఆయన మాట్లాడనున్నారు.

చైనా అనుకూల నాయకుడిగా పేరున్న ముయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ బలగాలు మాల్దీవులు వీడాలని ఆదేశించారు. దీంతో 90 మంది సైనిక సిబ్బందిని భారత్ ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేగాక మోడీ లక్ష్యద్వీప్ పర్యటన పైనా మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశంలో సంబంధాలు క్షీణించాయి. కాగా, దౌత్య వివాదం అనంతరం ముయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండో సారి. అంతకుముందు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed