బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించిన మోడీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు

by vinod kumar |
బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించిన మోడీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత పీఎం నరేంద్ర మోడీపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ద్వేష పూరిత, అగౌరవపరిచే ప్రసంగాలు చేయడం ద్వారా మోడీ బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించారని ఆరోపించారు. ఈ మేరకు ఏడో దశ ఎన్నికలకు ముందు పంజాబ్ ఓటర్లకు గురువారం ఓ లేఖ రాశారు. ‘ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో నేను రాజకీయ ఉపన్యాసాలను చాలా ఆసక్తిగా గమనిస్తున్నాను. మోడీ అత్యంత దుర్మార్గపు విద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడ్డారు. అవి పూర్తిగా సమాజాన్ని విభజించే స్వభావం కలిగి ఉన్నాయి. బహిరంగ ప్రసంగాల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయి. తద్వారా ప్రధాని కార్యాలయ స్థాయి కూడా తగ్గింది. గతంలో ఏ ప్రధానమంత్రి కూడా నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశ్యంతో ఇటువంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడలేదు’ అని తెలిపారు. ‘నేను నా జీవితంలో ఎప్పుడూ ఒక సమాజాన్ని వేరు చేయలేదు. అది బీజేపీకి మాత్రమే కాపీరైట్’ అని పేర్కొన్నారు.

‘అగ్నిపథ్ స్కమ్ పై స్పందించిన మన్మోహన్.. దేశభక్తి, ధైర్యసాహసాలు, సేవకు విలువ నాలుగేళ్లు మాత్రమేనని బీజేపీ భావిస్తోంది. ఇది వారి బూటకపు జాతీయ వాదాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది’ అని తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని పరిరక్షించబడే అభివృద్ధి-ఆధారిత భవిష్యత్తును కాంగ్రెస్ మాత్రమే నిర్ధారిస్తుందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహాతీతమైన గందరగోళాన్ని చవిచూసిందని విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో దయనీయ పరిస్థితి నెలకొందని తెలిపారు. కాబట్టి ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్యానికి అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి, సమ్మిళిత ప్రగతికి ఓటు వేయాలని పంజాబ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed