Delhi: ఢిల్లీ కేబినెట్‌లోకి కొత్త ముఖం.. అతిషితో పాటు ప్రమాణస్వీకారం

by Harish |
Delhi: ఢిల్లీ కేబినెట్‌లోకి కొత్త ముఖం.. అతిషితో పాటు ప్రమాణస్వీకారం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీకి కాబోయే కొత్త ముఖ్యమంత్రిగా అతిషి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబర్ 21న ఆమెతో పాటు, కొత్త మంత్రివర్గ సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే ఈ సారి కొత్త ముఖం అతిషి కేబినేట్‌లో కనిపించనుంది. ఆప్ ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆప్ పార్టీ గురువారం తెలిపింది. ఢిల్లీలోని సుల్తాన్‌పూర్ మజ్రా ఎమ్మెల్యే అయిన ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నియామకం అయ్యారు. 2020లో సుమారు 48,000 ఓట్లతో గెలిచిన అహ్లావత్ కొత్త మంత్రివర్గంలో దళిత ఎమ్మెల్యేగా ఉంటారు. రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న స్థానానికి ఆయనను ఎంపిక చేశారు.

కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్నటువంటి నలుగురు మంత్రులు.. గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్ కొత్త కేబినెట్‌లో కూడా ఉంటారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. కేజ్రీవాల్ కేబినెట్‌లో అతిషి.. ఆర్థిక, రెవెన్యూ, PWD, విద్య, నీరు వంటి 13 ప్రధాన శాఖలను నిర్వహించారు. చాలా శాఖలు సమర్థంగా నిర్వహించిన అనుభవం ఆమెకు ఉండటంతో పరిపాలన పరంగా ఆమెకు ఇబ్బందులు రాకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఢిల్లీ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా గరిష్టంగా ఏడుగురు మంత్రులు ఉండవచ్చు, అయితే ఆప్ ఇప్పటివరకు ఆరుగురు మంత్రులను మాత్రమే ప్రకటించింది.

Advertisement

Next Story