Jagjit Singh Dallewal : దల్లేవాల్‌కు అత్యవసర చికిత్స చేయించండి.. పంజాబ్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం

by Hajipasha |
Jagjit Singh Dallewal : దల్లేవాల్‌కు అత్యవసర చికిత్స చేయించండి.. పంజాబ్ సర్కారుకు సుప్రీంకోర్టు ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : గత నెల రోజులుగా(నవంబరు 26 నుంచి) ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్(Jagjit Singh Dallewal) ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం లేదని పంజాబ్ ప్రభుత్వాన్ని(Punjab Govt) సుప్రీంకోర్టు(Supreme Court) మందలించింది. దల్లేవాల్ ఆరోగ్యం విషమిస్తోందని ఆరోగ్య నివేదికలు వస్తున్నా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంలో రాష్ట్ర సర్కారు జాప్యం చేస్తోందని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఈ కామెంట్స్ చేసింది. జగ్జీత్ సింగ్ దల్లేవాల్‌కు అత్యవసర చికిత్స అందించే దిశగా సత్వర చర్యలు చేపట్టాలని, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

‘‘దల్లేవాల్‌కు అత్యవసర వైద్యచికిత్స చేయించాలని డిసెంబరు 20న మేం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర సర్కారు బేఖాతరు చేసింది. ఇందుకు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, డీజీపీ బాధ్యత వహించాలి. మా ఆదేశాలను అమలు చేయించాలి. ఇది ఒక మనిషి నిండు ప్రాణాలకు సంబంధించిన అంశమని గుర్తుంచుకోవాలి’’ అని సుప్రీంకోర్టు బెంచ్ నిర్దేశించింది. తమ ఆదేశాల అమలు జరిగిందా లేదా అనే వివరాలతో 24 గంటల్లోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని పంజాబ్ సర్కారును ఆదేశించింది. శనివారం రోజు ఈ కేసులో జరిగే విచారణకు వర్చువల్‌గా హాజరుకావాలని పంజాబ్ చీఫ్ సెక్రెటరీ, డీజీపీలను సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. కేంద్ర ప్రభుత్వం, హర్యానాలోని బీజేపీ సర్కారు తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ‘‘రైతు నేత దల్లేవాల్ ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ అంశంలో కేంద్ర సర్కారు జోక్యం చేసుకుంటే పరిస్థితులు అదుపు తప్పే ముప్పు ఉంది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed