మణిపూర్‌లో స్వల్ప భూకంపం..రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు

by vinod kumar |
మణిపూర్‌లో స్వల్ప భూకంపం..రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లోని చందేల్‌లో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం 77 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. తెల్లవారుజామున 2.28 గంటలకు ప్రకంపనలు వచ్చినట్టు పేర్కొంది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్న తరుణంలో భూకంపం సంభవించం ఆందోళన కలిగిస్తోంది.

గత నెల 28న ఉత్తరాఖండ్‌లోని పితోర్ గఢ్‌లోనూ 3.1తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రెమాల్ తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈశాన్య ప్రాంతంలోని అనేక చోట్ల వరద పరిస్థితి భయంకరంగా కొనసాగుతోంది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చోటాబెక్రా వద్ద బరాక్ నది దాని ప్రమాద స్థాయి 26.2 మీటర్ల కంటే 2.07 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. నీటి మట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ 28.27 మీటర్ల మేర ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed