ఆప్ మంత్రి అతిషికి సమన్లు జారీ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు

by Harish |
ఆప్ మంత్రి అతిషికి సమన్లు జారీ చేసిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషికి మే 28 న రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలను వేటాడేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని అతిషి ఆరోపణలు చేయగా, ప్రవీణ్ శంకర్, మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు జూన్ 29న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆమెకు సమన్లు ​పంపింది.

ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ తన ఫిర్యాదులో, ఆప్ మంత్రి బీజేపీపై తప్పుడు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, సామాన్య కార్యకర్తలు, పార్టీ ప్రతిష్టను దిగజార్చలనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, మంత్రి అతిషి, ఇతర సహచరులు కావాలనే బీజేపీ, దాని సభ్యుల పరువు తీస్తున్నారని అన్నారు. సోషల్ మీడయా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు ప్రకటనలు చేసి రాజకీయ మైలేజ్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఇలా చేయడం సరైంది కాదని తన పటిషన్‌లో ప్రవీణ్ శంకర్ పేర్కొన్నారు.

గతంలో ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన తర్వాత అతిషి తనను బీజేపీలో చేరేందుకు ఒత్తిడి చేశారని, బీజేపీ నాయకుడు తనను సంప్రదించి లంచం ఇవ్వడానికి చూశారని ఆరోపణలు చేసింది. బీజేపీలో చేరేందుకు నిరాకరిస్తే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తుందని ఆమె గతంలో పేర్కొనగా దీనిపై అతిషికి భారత ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసు అందజేసింది.

Advertisement

Next Story