ఢిల్లీలో కార్లను కడగొద్దు.. అలా చేస్తే జరిమానా: మంత్రి అతిషి

by Harish |
ఢిల్లీలో కార్లను కడగొద్దు.. అలా చేస్తే జరిమానా: మంత్రి అతిషి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ సమ్మర్ సీజన్‌లో ఢిల్లీలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల ప్రభావంతో దేశ రాజధానిలో నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి అతిషి ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నివసిస్తున్నవారు నీటిని వృధా చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ కార్లను కడగవద్దని ఆమె కోరారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె, మీ ప్రాంతంలో నీటి కొరత ఉన్నా, లేకపోయినా హేతుబద్ధంగా నీటి సరఫరాను వినియోగించుకోండి, నిరంతరాయంగా నీటి మోటార్లను నడిపించడం వలన నీరు వృధా అవుతుంది, దయచేసి ప్రజలు నీళ్ల వాడకం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ట్యాంకుల నుంచి నీళ్లు బయటకు పొంగిపొర్లకుండ చూసుకోండి, ఎవరైనా అదనపు నీటిని వాడినట్లు గుర్తించినట్లయితే జరిమానా విధిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మంగళ, బుధవారాల్లో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి పరిస్థితులు మరింత తీవ్రమవుతాయి. హర్యానా నుంచి ఢిల్లీకి చాలా తక్కువ మొత్తంలో నీటి సరఫరా జరుగుతుంది. రాబోయే రెండు రోజుల్లో నీటి వృధాను అరికట్టడానికి తీసుకున్న చర్యలను సమీక్షిస్తాం. నీటి వృధాను ఇంకా కట్టడి చేయకపోతే కోటాకు మించి ఎక్కువ నీళ్లను వాడే వారిపై జరిమానా విధించాల్సి ఉంటుంది. నీటిని దుర్వినియోగం చేయడం చాలా బాధ్యతారాహిత్యం అని మంత్రి అన్నారు. మే 1 నుంచి హర్యానా ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను విడుదల చేయడం లేదని మంత్రి అతిషి ఆరోపించారు. దేశ రాజధానిలో నీటి సరఫరాను హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేస్తుందని ఆమె అన్నారు.

Advertisement

Next Story