సిక్కులే లక్ష్యంగా చైనా నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్

by Harish |   ( Updated:2024-05-30 12:51:29.0  )
సిక్కులే లక్ష్యంగా చైనా నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మెటా తాజాగా తప్పుడు వార్తలను ప్రచారం చేసే నకిలీ ఖాతాలపై తీసుకున్న చర్యల తాలూకు డేటాను తాజాగా విడుదల చేసింది. నివేదిక ప్రకారం, మెటా దాదాపు 37 ఫేస్‌బుక్ ఖాతాలు, 9 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, 5 గ్రూపులు, మరిన్ని ఖాతాలు నిబంధనలకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని ఆయా ఖాతాలను తొలగించింది. ఈ తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడానికి నకిలీ ఖాతాలు ఎక్కువగా చైనా నుంచే సృష్టించబడ్డాయి.

ముఖ్యంగా సిక్కులను లక్ష్యంగా చేసుకుని చైనా ఈ నకిలీ ఖాతాలను తయారు చేసినట్లు మెటా అధికారులు గుర్తించారు. చైనా నుంచి నిర్వహించబడుతున్న ఈ ఖాతాలు భారతదేశం, కెనడా, పాకిస్తాన్, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నైజీరియా వంటి ప్రాంతాల్లో ఉన్న సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. సిక్కు వర్గం వారిని తప్పుదారి పట్టించడానికి, అల్లర్లను సృష్టించడానికి ఈ నకిలీ ఖాతాల ద్వారా తప్పుడు సమాచారాన్ని చేరవేసేవారని మెటా నివేదిక తెలిపింది.

మెటా కనిపెట్టిన దాని ప్రకారం, ఒక నకిలీ ఖాతాలో.. ఆద్యా సింగ్ తనను తాను ఢిల్లీలో నివసిస్తూ, సిక్కు వారసత్వం, భాష, సంస్కృతిపై అమితమైన మక్కువ ఉన్న పంజాబీ అమ్మాయిగా పరిచయం చేసుకుంది. ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లలో తరుచుగా భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేది, భారత ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఖలిస్తాన్‌కు మద్దతు ఇవ్వాలని, అమెరికాను సహాయం చేయాలని పోస్ట్‌లు చేసేది.

అయితే దీనిలో నిజం ఏంటంటే అసలు ఆద్యా సింగ్ అనే అమ్మాయి లేనేలేదు. చైనా నుంచి ఆ పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి భారత్‌‌పై విమర్శలు చేస్తున్నట్లుగా పోస్ట్‌లు చేసేవారు. భారత్‌పై విమర్శలు చేయడానికి చైనా గతకొంత కాలంగా ఇలాంటి నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నట్టు భారత ఇంటెలిజెన్స్ అధికారులు చాలా రోజులుగా పేర్కొంటుంగా ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి రావడంతో వారు చెప్పిందే నిజమైందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం 60కి పైగా చైనా-లింక్డ్ ఖాతాలను గుర్తించి వాటిని తొలగించినట్లు మెటా పేర్కొంది.

Advertisement

Next Story