అక్క‌డ రుద్దినా రేప్ కింద‌కే వస్తుంది: మేఘాల‌య హైకోర్టు కీల‌క తీర్పు

by Sumithra |
అక్క‌డ రుద్దినా రేప్ కింద‌కే వస్తుంది: మేఘాల‌య హైకోర్టు కీల‌క తీర్పు
X

దిశ‌, వెబ్‌డెస్క్ః 'వ‌ద్దు' అంటే దాని అర్థం స్ప‌ష్టంగా 'వ‌ద్దు' అనే..!', అంత‌కుమించి 'అవ‌కాశం' తీసుకోవాల‌నుకోవ‌డం లైంగిక హింస, దారుణ‌మైన నేరంగా ప‌రిగ‌ణిస్తున్న కాలం ఇది. అయినా, ఆడ‌వాళ్ల‌పై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఆగ‌డంలేదు. 'వ‌ద్దు' అని చెప్ప‌గ‌లిగిన స్త్రీల‌పైనే కాదు, 'అమ్మా' అనడం త‌ప్ప మ‌రో శ‌బ్దం తెలియ‌ని నెల‌ల ప‌సిగుడ్డుపైన కూడా కామ‌కావ‌రం తీర్చుకునే క‌ర్క‌శ మృగాళ్లున్న ఈ స‌మాజంలో స్త్రీల భ‌ద్ర‌త‌కు ఇంకెన్ని చ‌ట్టాలు రావాలో తెలియ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మేఘాల‌య హైకోర్టు కీలక తీర్పు వెల్ల‌డించింది. కామావేశంలో 'ముట్టుకున్నాను', 'ప‌ట్టుకున్నాను' త‌ప్ప ఇంకేమీ చేయ‌లేద‌ని బుకాయించే బురిడీగాళ్ల‌ను బుక్ చేసి, మ‌క్కెలు ఇర‌గ‌ద‌న్నే ఓ తీర్పును వెలువ‌రించింది. స్త్రీ జననేంద్రియాలపై పురుష అవయవాన్ని రుద్దడం కూడా అత్యాచారంగానే ప‌రిగ‌ణించింది. బ‌ల‌త్కారం చేస్తున్న స‌మ‌యంలో ఆమె లోదుస్తులు ధరించి ఉన్నా, అది 'చొచ్చుకుపోయే' సెక్స్‌గా పరిగణించబడుతుందని కోర్టు వెల్ల‌డించింది. ఇందులో అత్యాచారం కింద అభియోగాలు మోపవచ్చని కోర్టు స్ప‌ష్టం చేసింది.

'భార‌త శిక్షాస్మృతి'లోని సెక్షన్ 375(బి) ప్ర‌కారం యోని లేదా మూత్రనాళంలోకి ఏదైనా వస్తువును ఏ మేరకు చొప్పించిన‌ప్ప‌టికీ అత్యాచారంగా పరిగణించబడుతుంది. అయితే, మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పులో బాధితురాలు లోదుస్తులు ధరించి ఉన్నప్పటికీ, ఆమె జననాంగాలపై పురుష అవయవాన్ని రుద్దడం కూడా చొచ్చుకుపోయే సెక్స్‌గా పరిగణించబడుతుందని ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని హైకోర్టు డివిజన్ బెంచ్‌ తీర్పులో పేర్కొంది. 2006 నాటి ఓ కేసును బెంచ్ విచారించింది. ఈ కేసులో నిందితుడు ప‌దేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ట్రయల్ కోర్టు నిర్ధారించింది. అతనికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా (చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల జైలు శిక్ష) విధించింది. అయితే, నిందితుడు తాను చ‌దువు కోలేద‌ని, "నియంత్రణ కోల్పోయి" నేరానికి పాల్పడ్డానని, అయితే, ఆమె అప్పుడు లోదుస్తులు ధరించి ఉంద‌ని, బ‌ల‌వంతం చేయ‌డం త‌ప్ప సెక్స్ చేయ‌లేద‌ని చెప్పాడు. దాడి సమయంలో "అతను నా అండర్ వేర్‌ని తీయ‌లేదు" అని బాధితురాలు అంగీకరించింది. అయితే, ఆమె అండ‌ర్ ప్యాంట్ తీయ‌న‌ప్ప‌టికీ నేర‌స్థుడి మ‌ర్మాంగంతో రుద్ద‌డం కూడా అత్యాచారం కింద‌కే వ‌స్తుంద‌ని కోర్డు పేర్కొంది. ఈ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ మార్చి 14న తీర్పు వెలువ‌రిస్తూ ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.

Advertisement

Next Story

Most Viewed