Mbbs student: ఎంబీబీఎస్ ఫెయిలైన వ్యక్తితో చికిత్స.. కేరళలో హార్ట్ పేషెంట్ మృతి

by vinod kumar |
Mbbs student: ఎంబీబీఎస్ ఫెయిలైన వ్యక్తితో చికిత్స.. కేరళలో హార్ట్ పేషెంట్ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని కోజికోడ్ జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఎంబీబీఎస్ ఫెయిలైన ఓ వ్యక్తితో రోగికి గుండెకు సంబంధించిన చికిత్స చేయించడంతో ఆ పేషెంట్ మరణించారు. ఈ నెల 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ కుమార్ అనే పేషెంట్ కొద్ది రోజులుగా గుండె నొప్పి, ఊపిరి సరిగా రాకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆయనను కోజికోడ్ జిల్లాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలో డాక్టర్లు చికిత్స అందించిన కాసేపటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే అర్హత లేని డాక్టర్లు ఆస్పత్రిలో పని చేస్తున్నారని మృతుడి కుమారుడు అశ్విన్‌కు సమాచారం అందింది. ఇదే విషయమై వైద్య సిబ్బందిని ప్రశ్నించగా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ఆస్పత్రిల్లో వైద్యుడిగా పని చేస్తున్న అబూ అబ్రహం లూక్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. లూక్ 2011లో ఎంబీబీఎస్‌లో జాయిన్ అవ్వగా.. గత 12 సంవత్సరాలుగా ఆయన సెకండ్ ఇయర్ కూడా పాసవ్వలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే లూక్‌ను అరెస్ట్ చేశారు. అలాగే రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (ఆర్ఎంఓ)ని సైతం అదుపులోకి తీసుకున్నారు. రాబోయే రోజుల్లో హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారని ఆశిస్తున్నట్టు అశ్విన్ తెలిపారు. అయితే అబ్రహం అనేక ఆస్పత్రుల్లో పని చేశారని, అందుకే తమ ఆస్పత్రిలో నియమించుకున్నామని హాస్పిటల్ యాజమాన్యం తెలిపడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed