మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను వారసుడిగా ప్రకటించిన మాయావతి

by Shamantha N |
మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను వారసుడిగా ప్రకటించిన మాయావతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి మేనల్లుడు ఆకాష్ ఆనంద్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వారసుడిగా ఆకాష్ ఆనంద్ ను తిరిగి నియమించారు. బీఎస్పీ జాతీయ సమన్వయకర్త బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. ఆదివారం లక్నోలో బీఎస్పీ ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. అందులోనే ఈ విషయాన్ని ఆమె ప్రకటించారు. 2019లో ఆకాష్ ఆనంద్ ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమించారు. గతేడాది డిసెంబర్ లో ఆయన్ని తన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. కాగా, ఈ ఏడాది మే నెలలో ఆనంద్ ను జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించారు. రాజకీయ పరిపక్వత వచ్చే వరకు ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ నిర్ణయంపై బీఎస్పీ నాయకులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక, ఆకాష్ ఆనంద్‌ను పదవి నుండి తొలగించడానికి గల స్పష్టమైన కారణాన్ని ఆమె వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ 10 సీట్లు దక్కించుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ కష్టకాలంలో ఆకాష్‌ ఆనంద్‌ను మరోసారి జాతీయ సమన్వయకర్తగా నియమించడంతోపాటు తన వారసుడిగా మాయావతి ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed